|
|
by Suryaa Desk | Sat, Feb 14, 2026, 06:51 PM
ప్రతి నిత్యం లక్షా ముప్పై మందిపైగా పయనించే మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇక్కట్లు తొలగించేందుకు 5 శాఖల ఆధ్వర్యంలో సంయుక్త కార్యాచరణ. ఇక్కడి ప్రాంత నివాసులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ జామ్ సమస్యను పరిష్కరించేందుకు జలమండలి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, పోలీసు, ఇరిగేషన్, విద్యుత్ శాఖలు, టీజీఐఐసీ దీన్ని చేపట్టారు. ఈ మేరకు ట్రిడెంట్ హెటల్ నుంచి శిల్పారామం వరకు ఉన్న కిలోమీటర్ వరకు రోడ్డు విస్తరణ పనుల పురోగతిని అధికారులు పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, ట్రాఫిక్ డీసీపీ, ఏసీపీ, మున్సిపల్ జోనల్ కమిషనర్ హేమంత్ కలిసి పర్యటించారు. లెమన్ ట్రీ హోటల్ నుంచి ట్రిడెంట్ హోటల్ వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో.. అక్కడున్న ఎయిర్ వాల్వ్ లను, ఎలెక్ట్రిక్ పోల్స్ సమీపానికి తరలించడానికి అధికారులతో చర్చించారు. అక్కడ్నుంచి హైటెక్ సిటీ నుంచి మెడికవర్ ఆసుపత్రి వరకు చెప్పాల్సిన రోడ్డు విస్తరణ పనులను చర్చించారు. వాటిని సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను కోరారు. ఒక్కసారి ఇక్కడి పనులు పూర్తయితే.. మాదాపూర్, మైండ్ స్పేస్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇక్కట్లు కొంత వరకు తొలగిపోతాయి.
దుర్గం చెరువు పరిరక్షణకు చర్యలు: దుర్గం చెరువు పరిరక్షణకు ప్రభుత్వం సిద్ధమైంది. చెరువులో మురుగు నీరు చేరి అది కలుషితం కాకుండా తగిన చర్యలు చేపట్టనుంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు.. చెరువు పరిసరాలను జలమండలిఎండీ అశోక్ రెడ్డి, ఈడీ సంతోష్, మున్సిపల్, హెచ్ఎండీఏ, లేక్స్, రెవెన్యూ, ఇరిగేషన్ విభాగాల అధికారులు పరిశీలించారు. చెరువులో మురుగు నీరు చేరకుండా తగిన చర్యలు చేపట్టడానికి జాయింట్ ఇన్ స్పెక్షన్ నిర్వహించారు. రహేజా మైండ్ స్పేస్ ప్రాంతాల్లో భవన నిర్మాణ, గార్డెనింగ్, ల్యాండ్ స్కేపింగ్ అవసరాల కోసం ఎస్టీపీలో శుద్ధి చేసిన నీటినే వాడుకోవాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు.
మాదాపూర్, సైలెంట్ వాలీ ప్రాంతాలు, క్యాచ్ మెంట్ ఏరియాలో ఉత్పన్నమవుతున్న మురుగునీటిని.. జలమండలి దుర్గం చెరువులో నిర్మించిన రెండు ఎస్టీపీల (5 & 7 ఎమ్మెల్డీలు) ద్వారా శుద్ధి చేస్తున్నారు. దుర్గం చెరువు భూగర్భ నీటి మట్టం పెరిగేందుకు, చెరువు హైడ్రాలజీ కాపాడేందుకు ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని చెరువులోకి వదిలి పెడుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి అధికంగా వచ్చే మురుగు నీరు చెరువులో కలవకుండా 1000 ఎంఎం డయా పైపులైన్ ను మాదాపూర్ పెట్రోల్ బంక్ నుంచి మాదాపూర్ ఐ&డి వరకు ఉన్న పనులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి. పైపులైన్ నిర్మాణం పూర్తయితే లేక్ పార్కులో జరుగుతున్న సీవరేజ్ ఓవర్ ఫ్లో కూడా తగ్గనుంది. వర్షాకాలంలో వచ్చే వరద నీరు చెరువులో కలవకుండా వాటర్ డ్రైయిన్ సైతం పూర్తి చేయనుంది. చెరువు భూగర్భ జలాల స్థాయిలను కాపాడేందుకుఎస్టీపీలో శుద్ధి చేసిన నీటిని పార్కులో నిర్వహణ పనులకు, చెట్లు పెంచేందుకు ఉపయోగించాలని సూచించారు. రహేజా మైండ్ స్పేస్ ప్రాంతాల్లో భవన నిర్మాణ, పార్కు, ల్యాండ్ స్కేప్ నిర్వహణకు ఇతర అవసరాలకు తప్పనిసరిగా వంద శాతం రీసైకిల్ వాటర్ నే వినియోగించాలని ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. అందుకోసం దుర్గం చెరువు ఎస్టీపీ నుంచి ప్రత్యేక పైపు లైన్ ను నిర్మించాలని ఆదేశించారు. దుర్గం చెరువు ఎస్టీపీ నుంచి ట్రీటెడ్ వాటర్ తరలించి వాడుకునేలాగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జలమండలి ఎస్టీపీ ప్రాజెక్టు సీజీఎంలు పద్మజ, వాస సత్యనారాయణ, మున్సిపల్, ఇరిగేషన్ ఈఈ, టీజీఐఐసీ ఎస్సీ, సీఈ, ఇతర తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.