|
|
by Suryaa Desk | Sun, Feb 15, 2026, 07:59 PM
రాష్ట్రంలో ఇటీవల ఎన్నికలు జరిగిన మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడిన 34 చోట్ల అధికారాన్ని చేజిక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. కౌన్సిలర్లను కిడ్నాప్ చేయడం, ప్రలోభ పెట్టడం, ఇళ్లకు పోలీసులను పంపడం, గూండాలను ఉపయోగించడం వంటి చర్యలకు దిగుతోందని ఆయన విమర్శించారు.ఆదివారం తెలంగాణ భవన్‌లో జరిగిన సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. సోమవారం మున్సిపల్ ఛైర్‌పర్సన్లు, మేయర్ల ఎన్నిక జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మండిపడ్డారు.కొత్తగూడెం మున్సిపాలిటీలో సింగరేణి కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే సీపీఐకి మద్దతిస్తున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. సింగరేణి సంస్థను దోచుకోవడంలో కాంగ్రెస్, బీజేపీ రెండూ భాగస్వాములేనని, సంస్థకు నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. సీపీఐకి అనుబంధంగా ఉన్న ఏఐటీయూసీ కూడా కాంగ్రెస్‌తో పొత్తును ఎలా అంగీకరించిందో అర్థం కావడం లేదని, దీని వెనుక ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నాయో తెలియదన్నారు. ఎవరు కలిసినా, కలవకపోయినా సింగరేణి కార్మికుల హక్కుల కోసం బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందని ఆయన తేల్చిచెప్పారు.గతంలో తమ ప్రభుత్వం గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి, వేలాది మంది గిరిజన యువతకు రాజకీయ అవకాశాలు కల్పించిందని కేటీఆర్ గుర్తుచేశారు. సుమారు 4.5 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చి గిరిజనుల భూ హక్కులను కాపాడామని తెలిపారు.