|
|
by Suryaa Desk | Sun, Feb 15, 2026, 07:38 PM
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల విజయంతో అధికార కాంగ్రెస్ ఫుల్ జోష్‌లో ఉంది. ఇదే ఉత్సాహంలో రైతులకు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందించేందుకు సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసిందట. ఫిబ్రవరి 17వ తేదీన రైతు భరోసా నిధులు అకౌంట్లో జమ కానున్నట్లు సమాచారం. ఇక గతంలో మాదిరి కాకుండా ఈసారి ప్రభుత్వం ఒకే విడతలో రైతుభరోసా నిధులను విడుదల చేయనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
ఇప్పటివరకు ఎకరాల చొప్పున డబ్బులు విడుదల చేసేవారు. ముందు ఒకరం, రెండు ఒకరాల వరకు.. ఆ తర్వాత 5 ఎకరాల వరకు.. ఆ తర్వాత 10 ఎకారల వరకు ఇలా విడతల వారీగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేవారు. అయితే ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యేసరికి 9 రోజుల సమయం పట్టేది. ఈసారి రైతు భరోసా పంట పెట్టుబడికి అన్నదాతలు ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ఒకే విడతలో రైతుల ఖాతాల్లో డిపాజిట్ చేయనున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దీనిలో భాగంగా.. రైతు భరోసా నిధుల విడుదల కోసం రేవంత్ సర్కార్ నిధులను సమీకరించుకుంది. వాస్తవానికి మున్సిపల్ ఎన్నికలకు ముందే రైతు భరోసా పంట పెట్టుబడి సాయం విడుదల చేయాలని భావించారు. అయితే అనుకోని కారణాలు, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావటంతో నిధుల విడుదల ఆలస్యమైంది. ఇటీవల ఎన్నికల ప్రచారలో భాగంగా మిర్యాలగూడ సభ ప్రసంగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులపై క్లారిటీ ఇచ్చారు.
మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన వెంటనే రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని ప్రకటించారు. అందుకు అవసరమైన రూ.9 వేల కోట్లు నిధులు కూడా తాము సమీకరించుకున్నట్లు వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా.. ఫిబ్రవరి 16న మేయర్లు, ఛైర్మన్ల ఎన్నిక పూర్తవుతుంది. ఆ వెంటనే అంటే ఫిబ్రవరి 17న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు సర్కార్ సిద్ధమైంది.