|
|
by Suryaa Desk | Fri, Feb 13, 2026, 08:05 PM
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటోంది. మరోవైపు.. చాలా మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడుతోంది. దీంతో ఫలితాలు వెలువడినా మున్సిపల్ ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్.. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు ఏ పార్టీకి దక్కుతాయి అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పొత్తులు, ఇండిపెండెంట్ అభ్యర్థుల మద్దతు ఇప్పుడు చాలా కీలకంగా మారింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో క్యాంప్ రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గల్వాన్ లోయ ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు తల్లి బికుమళ్ల మంజుల ఉపేందర్.. ఈ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సూర్యాపేట మున్సిపాలిటీలో పోటీ చేయగా పరాజయం పాలయ్యారు.
సూర్యాపేట మున్సిపాలిటీ 44వ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా గల్వాన్ అమరుడు కల్నల్ సంతోష్ బాబు తల్లి బికుమళ్ల మంజుల ఉపేందర్ బరిలో నిలిచారు. తాజాగా వెల్లడైన ఫలితాల్లో ఆమె ఓటమి చెందారు. మొత్తం 48 వార్డులు ఉన్న సూర్యాపేట మున్సిపాలిటీలో.. తాజా ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 31 చోట్ల విజయం సాధించింది. బీఆర్ఎస్ పార్టీ 13 వార్డులు, బీజేపీ ఒక వార్డులో, ఇతరులు 3 స్థానాల్లో గెలిచారు. అయితే 44వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మంజుల ఉపేందర్ ఓటమి పాలయ్యారు.
ఈ వార్డులో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి గునగంటి హేమ విజయం సాధించారు. ఆ వార్డులో గునగంటి హేమకు 743 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మంజులకు 398 ఓట్లు పోలవగా.. బీజేపీ అభ్యర్థి పెద్ది రమాదేవికి 126 ఓట్లు పడ్డాయి. ఇక స్వతంత్రులుగా పోటీ చేసిన ఉమారాణికి 164 ఓట్లు.. సిరి చందనకు 8 ఓట్లు వచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి మంత్రి జగదీష్ రెడ్డి నాయకత్వంలోనే సూర్యాపేటలో అభివృద్ది జరిగిందని తెలిపారు. అటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రజలకు సేవ చేసేందుకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెప్పారు. తనను గెలిపించాలని కోరారు. అయితే ఈరోజు మున్సిపల్ ఎన్నికల ఫలితాల వెలువడుతుండగా... సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.