|
|
by Suryaa Desk | Fri, Feb 13, 2026, 08:10 PM
ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారిన కానిస్టేబుల్ సస్పెన్షన్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున గీతాంజలి పోటీ చేశారు. అయితే గీతాంజలి భర్త రమేష్ కానిస్టేబుల్ కాగా.. ఆయన కూడా ప్రచారంలో పాల్గొన్నట్లు పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం అందింది. చేర్యాల మండలం కొమురవెళ్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా రమేష్ పని చేస్తున్నాడు. దీంతో విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు.. ఆ కానిస్టేబుల్‌ను విధుల నుంచి సస్పెండ్ చేశారు.
ఈ సస్పెన్షన్‌ను నిరసిస్తూ.. ఆ కానిస్టేబుల్, తన భార్య, కుటుంబ సభ్యులతో ఆందోళన చేపట్టడంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఇక తాజాగా వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో గీతాంజలి గెలిచారు. చేర్యాల మున్సిపాలిటీ 2వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ తరఫున కమలాపురం గీతాంజలి పోటీ చేయగా.. తాజా ఫలితాల్లో ఆమె విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ముస్త్యాల తేజపై 223 ఓట్ల తేడాతో గెలిచారు.
కమలాపురం గీతాంజలికి 620 ఓట్లు పోల్ కాగా.. ముస్త్యాల తేజకు కేవలం 397 ఓట్లు పడ్డాయి. ఇక మూడో స్థానంలో ఉన్న బీజేపీ అభ్యర్థి చండ స్వరూప షారోన్‌కు కేవలం 14 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో కమలాపురం గీతాంజలి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. అయితే ఇటీవల తన భర్తను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు రావడంపై బీఆర్ఎస్ అభ్యర్థి కమలాపురం గీతాంజలి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తన ఎన్నికల ప్రచారంలో తన భర్త ప్రచారంలో పాల్గొనలేదని.. డీసీపీ తిట్టినందుకు ఆయన కళ్లు తిరిగి పడిపోయాడని తెలిపారు.
ఈ నేపథ్యంలోనే తన భర్తను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించామని.. తాను పోటీలో నిల్చున్నందుకే తన భర్తను కానిస్టేబుల్ విధుల నుంచి సస్పెండ్ చేశారని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తను విధుల నుంచి సస్పెండ్ చేయడం కాంగ్రెస్ నేతలు చేస్తున్న కక్షపూరిత చర్యల్లో భాగమని.. వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని ఆమె డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు.