|
|
by Suryaa Desk | Sat, Feb 14, 2026, 09:17 PM
తెలంగాణలో మరో కొత్త హైవే అందుబాటులోకి రానుంది. మహబూబ్‌నగర్ నుంచి కర్ణాటక సరిహద్దు గుడబెళ్లూరు వరకు చేపట్టనున్న 4 లైన్ల జాతీయ రహదారి ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ హైవే నిర్మాణానికి రూ.3,175 కోట్ల నిధుల విడుదలకు పచ్చజెండా ఊపింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ ముగిసింది. ఈ భేటీలో మహబూబ్‌నగర్- గుడబెళ్లూరు 4 లైన్ల హైవే నిర్మాణానికి రూ.3,175 కోట్ల నిధుల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మొత్తంగా రూ. 1.60 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపారు.
ఇక మహబూబ్‌నగర్- గుడబెళ్లూరు ప్రాజెక్టు హైదరాబాద్ - గోవా ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా ఉంది. దీనివల్ల హైదరాబాద్ నుంచి రాయచూర్, మంత్రాలయం, మరియు గోవా వెళ్లే ప్రయాణికులకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. రూ.3,175 కోట్ల వ్యయంతో 80.01 కిలోమీటర్లు హ్యామ్ విధానంలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ఈ ప్రాజెక్టు చేపట్టనుంది. ఈ రహదారి మహబూబ్‌నగర్ నుంచి మొదలై.. దేవరకద్ర, మరికల్, మఖ్తల్, మాగనూరు మీదుగా గూడెబల్లూరు ( రాయచూర్ సరిహద్దు) వరకు సాగుతుంది. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండటానికి మహబూబ్‌నగర్, దేవరకద్ర, మరికల్, మఖ్తల్, మరియు మాగనూరు పట్టణాల వద్ద ప్రత్యేకంగా బైపాస్ రోడ్లను నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న 2 లైన్ల రోడ్డును 4 లైన్లుగా మార్చడం వల్ల ప్రయాణ సమయం దాదాపు 1.5 గంటలు తగ్గుతుంది. నారాయణపేట, మహబూబ్‌నగర్ జిల్లాల ఆర్థిక అభివృద్ధికి ఇది ఎంతో దోహదపడుతుంది. హైదరాబాద్ నుంచి గోవా వెళ్లే వారికి ఇది అత్యంత వేగవంతమైన మార్గంగా మారుతుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర క్యాబినెట్ ఆమోదం లభించగా.. టెండర్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. భూసేకరణకు సంబంధించిన నష్టపరిహారం చెల్లింపులు కూడా జరుగుతున్నాయి. ఇక రాష్ట్రంలో మరికొన్ని రోడ్డు ప్రాజెక్టులు కూడా ప్రారంభ దశలో ఉన్నాయి. మన్ననూరు- శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు కూడా ప్రారంభం కానున్నాయి. శ్రీశైలం ఆలయానికి దగ్గరగా ఈ కారిడార్ నిర్మించనున్నారు. దీంతో శ్రీశైలం వెళ్లే వారికి సమయంతో పాటు దూరం తగ్గనుంది.