|
|
by Suryaa Desk | Sat, Feb 14, 2026, 09:20 PM
తెలంగాణ మున్సిపల్ ఫలితాలు వెల్లడైన సంగతి తెలిసిందే. అన్ని పార్టీలు ఆ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోగా.. అధికార కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిపత్యాన్ని కనబరిచింది. కొందరు అభ్యర్థులు లక్షలు, కోట్లు ఖర్చు పెట్టినా.. విజయం సాధించలేకపోయారు. నామినేషన్ సమయంలోనే రూ.8 కోట్లు వెచ్చించిన నిజామాబాద్ కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి కాటిపల్లి శమంతకు స్థానిక ఓటర్లు షాకిచ్చారు. 19వ డివిజన్ నుంచి బరిలోకి దిగిన ఆమె.. బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. నామినేషన్ సమయంలో ఆమె మున్సిపాలిటీకి పన్ను బకాయి ఉండటంతో రూ. 8 కోట్లు పన్ను చెల్లించి నో డ్యూ సర్టిఫికెట్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత ముందుగానే మేయర్ అభ్యర్థిగా ప్రకటించటంతో గెలుపు కోసం ఏమాత్రం వెనకాడలేదని సమాచారం. డివిజన్‌లోనూ ఓటుకు డబ్బులిచ్చినా ఓటర్లు కనికరం చూపలేదు. మెుత్తంగా ఆమె 20 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసింది.
కాగా, నిజామాబాద్ కార్పొరేషన్‌లో మెుత్తం 60 డివిజన్లు ఉండగా.. బీజేపీ 28 స్థానాల్లో విజయం సాధించింది. అధికార కాంగ్రెస్ 17, ఎంఐఎం 14, బీఆర్ఎస్ ఒక్క చోట మాత్రమే విజయం సాధించాయి. ఏ పార్టీకి ఇక్కడ స్పష్టమైన ఆధిక్యత లభించలేదు. మేయర్ పీఠం దక్కాలంటే 31 స్థానాలు రావాలి. ఎంఐఎంతో కలిపి తమకు 31 స్థానాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. ఎక్స్ ఆఫీషియో సభ్యుల ఓట్లతో తామే ఇందూరు మేయర్ స్థానాన్ని దక్కించుకుంటామని బీజేపీ నేతలు అంటున్నారు. ఈ నెల 16న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది.
ఇక మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. మొత్తం 116 మున్సిపాలిటీల్లో 66 చోట్ల స్పష్టమైన ఆధిక్యాన్ని ఆ పార్టీ సాధించింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ 13 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. బీజేపీ ఒక్క మున్సిపాలిటీలోనూ సగానికంటే ఎక్కువ వార్డులు గెలుచుకోలేకపోయింది. వార్డుల పరంగా చూస్తే మొత్తం 2,581 వార్డుల్లో కాంగ్రెస్ 1,347, బీఆర్ఎస్ 716, బీజేపీ 261, ఎంఐఎం, లెఫ్ట్ పార్టీలు, ఇతరులు కలిపి 257 చోట్ల విజయం సాధించారు. మెుత్తం 7 మున్సిపల్ కార్పొరేషన్లలో 3 కాంగ్రెస్ దక్కించుకోగా.. ఒకటి బీజేపీ, మరో మూడు చోట్ల హంగ్ ఏర్పడింది. హంగ్ ఉన్న చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.