|
|
by Suryaa Desk | Sat, Feb 14, 2026, 09:22 PM
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. సంపూర్ణమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మున్సిపాలిటీల్లోని 2581 వార్డులకు గాను.. కాంగ్రెస్ 1347 చోట్ల సత్తా చాటింది. బీఆర్ఎస్‌కు 716, బీజేపీకి 261 వార్డులు మాత్రమే దక్కాయి. మొత్తం 414 డివిజన్లలో కాంగ్రెస్‌కు 190, బీజేపీకి 75, బీఆర్ఎస్‌కు 60 డివిజన్లు దక్కాయి. మెుత్తంగా 66 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకోగా.. బీఆర్ఎస్ 13 స్థానాలను మాత్రమే పరిమితమైంది. నాలుగు మున్సిపాలిటీల్లో అయితే ఆ పార్టీ ఖాతా కూడా తెరవలేదు. ఒక్కటంటే ఒక్క వార్డును కూడా గెలుచుకోలేకపోయింది.
భైంసా, కోస్గి, మక్తల్, ధర్మపురి మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీకి సున్నా వార్డులు వచ్చాయి. ధర్మపురిలో మొత్తం 15 వార్డులు ఉండగా.. అన్నింటినీ అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కోస్గిలోనూ 16 స్థానాలు ఉండగా మొత్తం కాంగ్రెస్ ఖాతాలోనే చేరాయి. ఇక మరో 13 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ సింగిల్ డిజిట్‌కు మాత్రమే పరిమితమైంది. మంథని, మధిర, కొడంగల్, హాలియా, చొప్పదండి, భూత్పూర్, ఎల్లారెడ్డి, యాదగిరిగుట్ట, వడ్డేపల్లి, సుల్తానాబాద్, పెద్దపల్లి, నందికొండ, ఆత్మకూరు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఒక్కో వార్డులో మాత్రమే విజయం సాధించారు. ఇక 36 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. దీంతో అక్కడ హంగ్ ఏర్పడింది. మహబూబ్‌నగర్ జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మద్దతుతో పోటీ చేసిన ఆల్‌ఇండియా ఫార్వర్డ్‌బ్లాక్ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు.
ఇక జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి మద్దతుదారులు స్వతంత్రులుగా పోటీ చేసి అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన డాక్టర్ సంజయ్ వర్గానికి కాంగ్రెస్ టికెట్లు కేటాయించగా.. జీవన్ రెడ్డి మద్దతుదారులు ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగి అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్నారు. కాగా, ఈనెల 16న నగరపాలికల్లో మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక జరగనుంది. చేతులెత్తే విధానంలో ఈ ఎన్నికలు జరగనుండగా.. పలు చోట్ల హంగ్ ఏర్పడటంతో ఈ ఎన్నికలు కూడా రసవత్తరంగా మారాయి. ఇప్పటికే అన్ని పార్టీలు గెలిచిన అభ్యర్థులను క్యాంపులకు తరలించాయి.