|
|
by Suryaa Desk | Sat, Feb 14, 2026, 07:46 PM
తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్‌లో ఉంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల జోష్‌లో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. త్వరలోనే రైతులకు శుభవార్త వినిపించనున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తైన వెంటనే రైతులకు.. రైతు భరోసా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. రైతు భరోసా పథకం కింద యాసంగి సీజన్‌కు సంబంధించి రైతులకు పెట్టుబడి సాయంగా.. వారి బ్యాంక్ ఖాతాలలో నిధులు జమ చేయనున్నారు. ఎకరాకు రూ.6,000 చొప్పున రైతు భరోసా డబ్బులను అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇందుకోసం ఫిబ్రవరి 17వ తేదీని ముహూర్తంగా నిర్ణయించినట్లు సమాచారం.
మరోవైపు రైతు భరోసా నిధుల విడుదల కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిధులను సమీకరించుకుంది. వాస్తవానికి మున్సిపల్ ఎన్నికలకు ముందే రైతు భరోసా నిధులు విడుదల చేయాలని భావించారు. అయితే అనుకోని కారణాలతో నిధుల విడుదల ఆలస్యమైంది. మరోవైపు మిర్యాలగూడ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రైతు భరోసా నిధులపై క్లారిటీ ఇచ్చారు. ఎన్నికలు పూర్తైన వెంటనే రైతుల బ్యాంక్ ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని ప్రకటించారు. అందులో భాగంగానే రూ.9 వేల కోట్లు నిధులు కూడా సమీకరించుకున్నట్లు తెలిసింది.
తాజాగా తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ కూడా పూర్తైంది. ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్‌లో ఫిబ్రవరి 17వ తేదీన రైతుభరోసా నిధులు విడుదల చేయాలని తెలంగాణ సర్కారు భావిస్తున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఈ విషయం మీద మంత్రులతో సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం. శనివారం సాయంత్రం రేవంత్ రెడ్డి తన నివాసంలో మంత్రులతో చర్చించనున్నట్లు తెలిసింది. రైతులకు యాసంగి సీజన్ రైతు భరోసా నిధుల విడుదలతో పాటుగా హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీలలో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే దానిపైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించనున్నట్లు సమాచారం.