|
|
by Suryaa Desk | Fri, Feb 13, 2026, 06:39 PM
హైదరాబాద్ జిల్లా, ఆసిఫ్‌నగర్ మండలం గుడిమల్కాపూర్ గ్రామంలో ఏజీ ఆఫీస్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ పేరిట 10 ఎకరాల్లో 83 ప్లాట్లతో దశాబ్దాల క్రితం లేఔట్ వేశారు. ఇందులో 79, 80, 81 నంబర్లతో ఉన్న ప్లాట్లు గుంతలో ఉన్నాయి. లే ఔట్‌ను రివైజ్ చేసి ఇక్కడ ప్లాట్లున్నవారికి వేరే చోట కేటాయించారు. గుంతలా ఉన్న 1500ల గజాల స్థలాన్ని పార్కుగా పేర్కొన్నారు. ఆ గుంత పూడ్చి పార్కును చేయడంలో జాప్యం అవ్వడంతో అది కబ్జాదారులకు వరంగా మారింది. తర్వాత నిర్మాణాలు పెరగడంతో ఆ గుంతలు పూడ్చడం పెద్ద పనికాలేదు వారికి. ఇక అక్కడి నుంచి ఆ పార్కు స్థలాన్ని కబ్జా చేసి ఒకరు ఇసుక వ్యాపారం చేసుకుంటుండగా.. మరొక వ్యక్తి వాహనాల పార్కింగ్ కోసం వినియోగిస్తున్నారు. మరొకరు కొబ్బరి బొండాల వ్యాపారం చేసుకుంటున్నారు. ఈ పార్కును కాపాడాలని 2018లో జీహెచ్ ఎంసీని అక్కడి నివాసితులు కోరారు. అయినా ప్రయోజనంలేదని వాపోయారు. ఈ అంశాలన్నిటీనీ పేర్కొంటూ హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో విచారించి.. పార్కు స్థలంగా హైడ్రా అధికారులు నిర్ధారించుకున్నారు. శుక్రవారం ఆక్రమణదారులను ఖాళీచేయించి సుమారు 1452 గజాల మేర హైడ్రా ఫెన్సింగ్ వేసింది. పార్కు స్థలంగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది.