|
|
by Suryaa Desk | Fri, Feb 13, 2026, 09:39 PM
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల, మాజీ మంత్రి హరీష్ రావు పట్టున్న గజ్వేల్, సిద్ధాంతకర్తల అడ్డాగా పేరున్న దుబ్బాక మినహా మరెక్కడా ఆశించిన ఫలితాలు రాలేదు. అగ్రనేతలు గెలిచిన చోట్ల మినహాయించి, మిగిలిన నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యేలు మరియు కీలక నేతలు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ విజయం ముంగిట బోల్తా పడటం ఇప్పుడు పార్టీ నాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తోంది.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేట సహా జిల్లాలోని ఇతర ప్రధాన మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ విఫలమైంది. ఒకప్పుడు తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన ఈ జిల్లాలో ఇప్పుడు పార్టీ రెండవ స్థానానికే పరిమితం కావడం లేదా హంగ్ పరిస్థితులను ఎదుర్కోవడం విశేషం. కేడర్ బలంగా ఉన్నప్పటికీ, ఓటర్లను ఆకట్టుకోవడంలో స్థానిక నేతలు ఎక్కడ విఫలమయ్యారనే దానిపై ఇప్పుడు పార్టీ అంతర్గతంగా సమీక్షించుకుంటోంది.
వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో కూడా పార్టీకి మిశ్రమ ఫలితాలే ఎదురయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో కూడా పార్టీ ఆశించిన రీతిలో రాణించలేకపోయింది. అటు కరీంనగర్ జిల్లాలో కీలకమైన హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో పాడి కౌశిక్ రెడ్డి గట్టి ప్రయత్నం చేసినప్పటికీ, ఫలితం దక్కకపోవడం గమనార్హం. ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేయడంలో క్షేత్రస్థాయి సమన్వయం లోపించిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో మాత్రం బీఆర్ఎస్ తన పట్టును నిలబెట్టుకోవడం పార్టీకి కొంత ఊరటనిచ్చే అంశం. గ్రేటర్ పరిసరాల్లోని మున్సిపాలిటీల్లో పార్టీ క్యాడర్ సమర్థవంతంగా పనిచేయడంతో మెరుగైన ఫలితాలు వచ్చాయి. ఓవరాల్‌గా రాష్ట్రవ్యాప్తంగా చూస్తే పార్టీ గ్రాఫ్ తగ్గడంపై అధిష్టానం సీరియస్‌గా దృష్టి సారించింది. ఓటమికి గల కారణాలను విశ్లేషించి, భవిష్యత్తు కార్యాచరణను రూపొందించేందుకు కేసీఆర్ నేతృత్వంలో త్వరలోనే కీలక భేటీ నిర్వహించే అవకాశం ఉంది.