|
|
by Suryaa Desk | Thu, Mar 05, 2026, 06:26 PM
నాగర్‌కర్నూల్ జిల్లా ఇంటర్ స్టూడెంట్ ప్రసవం ఘటనలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. తనతో పాటు చదువుకున్న సహచర బాలుడే గర్భానికి కారణమని బాలిక అతడిని ఇరికించబోయింది. టెన్త్ పరీక్షలు రాసే సమయంలో ఓ బాలుడితో పరిచయం ఏర్పడిందని.. అతని వల్లే గర్భం దాల్చానని చెప్పింది. బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. తనకేం తెలియదని చెప్పాడు. మరోసారి బాలికను గట్టిగా ప్రశ్నించగా.. ఆ గర్భానికి కారణం ఒక వివాహితుడైనే బంధువే అన్న నిజం బయటపడింది.
ఘటన వివరాల్లోకి వెళితే.. కొల్లాపూర్ మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఓ 16 ఏళ్ల బాలిక కేజీబీవీలో ఇంటర్ చదువుతోంది. మార్చి 2న పరీక్ష రాసిన అనంతరం తీవ్రమైన కడుపునొప్పితో బాధపడటంతో తల్లి ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లింది. డాక్టర్ల సూచన మేరకు స్కానింగ్ సెంటర్‌కు వెళ్లగా.. అక్కడ నొప్పులు తీవ్రమయ్యాయి. స్కానింగ్ సెంటర్‌లోని వాష్‌రూమ్‌కు వెళ్లిన బాలికకు అక్కడే ప్రసవం జరిగింది. పరువు పోతుందనే భయంతో ఆమె తల్లి అప్పుడే పుట్టిన పసికందును సంచిలో పెట్టి చెత్తబుట్టలో పడేసింది. అయితే.. అక్కడి సిబ్బంది అప్రమత్తతతో శిశువు ప్రాణాలు దక్కాయి. బిడ్డను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం తల్లీబిడ్డలిద్దరిని ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు.
ట్విస్టుల మీద ట్విస్టులు.. బయటపడ్డ అసలు నిందితుడు
మొదట పోలీసుల విచారణలో బాలిక తన గర్భానికి కారణం పదో తరగతిలో పరిచయమైన ఒక బాలుడు అని చెప్పింది. అయితే.. పోలీసులు ఆ బాలుడిని విచారించగా కేవలం సోషల్ మీడియా చాటింగ్ తప్ప తమ మధ్య శారీరక సంబంధం లేదని చెప్పాడు. మరోసారి బాలికను విచారించిన పోలీసులు.. డీఎన్ఏ టెస్ట్ చేస్తే అన్నీ తెలిసిపోతాయని బాలికతో చెప్పారు. దీంతో బాలిక అసలు నిజాన్ని ఒప్పుకుంది. తన ఇంటి పక్కనే ఉంటూ.. వరసకు అన్నయ్య అయ్యే గంగరాజు అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడని వెల్లడించింది.
నిందితుడు గంగరాజుకు ఇప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలతో ఆడుకునేందుకు ఆ బాలిక తరచూ అతడి ఇంటికి వచ్చేది. పదో తరగతి చదువుతున్న సమయం నుంచే బాలికకు మాయమాటలు చెప్పి అతడు లొంగదీసుకున్నాడు. కేజీబీవీలో ఇంటర్ చదువుతున్న బాలిక సెలవు రోజుల్లో ఇంటికి వచ్చేది. ఇంటికి వచ్చినప్పుడల్లా గంగరాజు శారీరకంగా వాడుకున్నాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. నిందితుడు గంగరాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
కాగా, బాలిక గర్భందాల్చి 9 నెలలు నిండు గర్భిణిగా ఉన్నా పాఠశాలలో పర్యవేక్షకులుగా ఉన్న ఉపాధ్యాయులు కానీ.. అటు ఇంటి వద్ద తల్లిదండ్రులు కానీ.. తోటి విద్యార్థినులు కానీ గుర్తించకపోవడం విచారకరం. వదులుగా ఉండే డ్రెస్సులు వేస్తూ స్కూల్‌లో టీచర్లను, ఇంటి వద్ద తల్లిదండ్రులకు విషయం తెలియకుండా బాలిక కప్పి పుచ్చినట్లు తెలిసింది.