|
|
by Suryaa Desk | Mon, Feb 09, 2026, 01:48 PM
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, ఫిబ్రవరి 11న జరగనున్న పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎక్సైజ్ శాఖ డ్రై డే ప్రకటించింది. ఎన్నికల నిబంధనల ప్రకారం, ఫిబ్రవరి 9 సాయంత్రం 5 గంటల నుంచి 11న సాయంత్రం 5 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఫిబ్రవరి 13న ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో, ఆ రోజు కూడా సంబంధిత మున్సిపాలిటీల పరిధిలో వైన్స్, బార్లను మూసివేయాలని ఆబ్కారీ శాఖ స్పష్టం చేసింది. మరోవైపు, మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. అధికారులు క్షేత్రస్థాయిలో నిఘా పెంచారు, అక్రమ మద్యం రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.. వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో రంగంలోకి దిగిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు ఒకరిపై మరొకరు పై చేయి సాధించాలన్న పట్టులతో ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలతో పాటు ఆయా పార్టీల నుంచి రెబల్స్ గా పోటీ చేస్తున్న అభ్యర్థులు, ఇండిపెండెంట్ అభ్యర్దులు ప్రచారంలో మునిగి తేలారు. ర్యాలీలు, డప్పు చప్పుళ్లు, డీజే పాటల మోతలతో ప్రచారాన్ని హోరెత్తించారు. చివరి రోజు సుడిగాలి పర్యటనలకు నేతలు సిద్ధం అయ్యారు. నేడు సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి బ్రేక్ పడనుంది.