|
|
by Suryaa Desk | Thu, Feb 19, 2026, 10:48 PM
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ను తెలంగాణ జాతిపిత అని పిలవడాన్ని తీవ్రంగా ఖండించిన కడియం శ్రీహరి.. ఆయన తెలంగాణకు ఏం చేశారని ప్రశ్నించారు. కేసీఆర్ తెలంగాణకు జాతిపిత ఎలా అయ్యారో చెప్పాలని నిలదీశారు. జాతిపిత అని పిలవడానికి సిగ్గుండాలంటూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల సమస్యలపై స్పందించని వ్యక్తిని, అసెంబ్లీకి రాని వ్యక్తిని తెలంగాణ జాతిపితగా ఎలా గుర్తిస్తారు అంటూ కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ అధికారంలో ఉన్న 10 ఏళ్ల పాలనలో.. రాష్ట్రం బాగుపడటం కంటే కేసీఆర్ కుటుంబమే ఆర్థికంగా చాలా బలపడిందని కడియం శ్రీహరి తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు అందరూ.. ఏదో ఒక కుంభకోణంలో చిక్కుకున్నారని పేర్కొన్నారు. వారు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారని.. దీనివల్ల భవిష్యత్ తరాలపై తీవ్ర ఆర్థిక భారం పడేశారని మండిపడ్డారు.
అదే సమయంలో ఇటీవల కేసీఆర్ వాడి పదజాలంపైనా కడియం శ్రీహరి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏమైనా నీ అయ్య సొత్తా.. నీ అయ్య జాగీరా అంటూ ఘాటుగా ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోయినప్పటికీ.. కేసీఆర్‌లో మాత్రం అహంకారం కొంచెం కూడా తగ్గలేదని అన్నారు. కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలను గౌరవించడం రాదని విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజల సమస్యలపై స్పందించకుండా కేవలం ఫామ్‌హౌస్‌లోనే ఉంటున్న కేసీఆర్.. నాయకుడెలా అవుతారని ప్రశ్నించారు. తెలంగాణను లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ముంచిన ఘనత కేసీఆర్‌దేనని తెలిపారు. తెలంగాణ అంటే ఒకరి సొత్తు కాదని.. ఇది తెలంగాణ ప్రజల పోరాట ఫలితం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కడియం శ్రీహరి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీశాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న వేళ.. కడియం శ్రీహరి కూడా ఆ లిస్ట్‌లో ఉండగా.. ఆయన కేసీఆర్‌పై తీవ్రంగా మండిపడటం గమనార్హం. పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చీట్ ఇచ్చారు. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో కడియం శ్రీహరితోపాటు.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఉన్నారు. వీరి అనర్హతపై స్పీకర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.