by Suryaa Desk | Fri, Dec 27, 2024, 02:43 PM
ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మధ్యంతర బెయిల్ ను తెలంగాణ హైకోర్టు మరో రోజు పాటు పొడిగించింది. ఫార్మూలా- ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై శుక్రవారం నాడు తెలంగాణ హైకోర్టు విచారించింది. ఈ నెల 21న కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై డిసెంబరు 30 వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని ఏసీబీని ఇంతకుముందు ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. దీంతో ఇవాళ ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు ఈ నెల 31 వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది.ఈ కేసులో హైకోర్టులో ఏసీబీ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దని ఇచ్చిన ఆదేశాలను ఎత్తివేయాలని కోరుతూ మరో పిటిషన్ ను వేశారు. ఈ పిటిషన్ పై విచారణను కోర్టు డిసెంబర్ 31కి వాయిదా వేసింది. ఈ కేసులో కేటీఆర్ ను విచారించాలని ఏసీబీ కోరుతోంది. ఈ దశలో ఆయనకు బెయిల్ మంజూరు చేసినా, ఆయనకు ఎలాంటి రిలీఫ్ ఇచ్చినా విచారణకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని ఆ పిటిషన్ లో ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. ఈ కారణంతో కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దనే ఆదేశాలను ఎత్తివేయాలని కోరారు.