|
|
by Suryaa Desk | Tue, Mar 03, 2026, 02:28 PM
పీఎఫ్ చందాదారులకు శుభవార్త. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.25 శాతంగా కొనసాగించాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) నిర్ణయించింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 239వ సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. వడ్డీ రేటును యథాతథంగా కొనసాగించడం ఇది వరుసగా మూడో ఏడాది కావడం గమనార్హం. ఈ నిర్ణయం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 7.8 కోట్లకు పైగా పీఎఫ్ చందాదారులు స్థిరమైన రాబడిని పొందనున్నారు.బోర్డు సిఫార్సు చేసిన ఈ వడ్డీ రేటు ప్రతిపాదనను ఇప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదానికి పంపనున్నారు. ఆర్థిక శాఖ నుంచి ఆమోదం లభించిన తర్వాత ఈపీఎఫ్ఓ చందాదారుల ఖాతాల్లో వడ్డీని జమ చేస్తుంది. పీఎఫ్ ఖాతాల్లోని బ్యాలెన్స్‌పై నెలవారీగా వడ్డీని లెక్కించినప్పటికీ, ఏడాదికి ఒకసారి మాత్రమే ఖాతాలో జమ చేస్తారు. అయితే, 36 నెలలుగా ఎలాంటి కంట్రిబ్యూషన్ లేని క్రియారహిత (ఇన్‌యాక్టివ్) ఖాతాలకు వడ్డీ జమ కాదని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది.