by Suryaa Desk | Fri, Jan 31, 2025, 08:34 PM
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. చాన్నాళ తర్వాత వార్తల్లో నిలిచారు. ఫామ్ హౌస్‌లో జహీరాబాద్ నేతలతో సమావేశమైన కేసీఆర్.. కాంగ్రెస్ పాలనలో పథకాలన్నీ గంగలో కలిశాయని, రాష్ట్రంలో ఒక్క పథకం కూడా సరిగా అమలు కావడం లేదని రేవంత్ సర్కార్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. నమ్మి ఓట్లు వేసిన ప్రజలను నట్టేట ముంచారని మండిపడ్డారు. కొడితే మామూలుగా కాదు గట్టిగా కొట్టడం తన అలవాటు అని చెప్పి రాబోయేది తమ విజయమని సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేశారు. అయతే, ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నుంచి కూడా గట్టిగా కౌంటర్ వస్తోంది.తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు. రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాల వార్షికోత్సవంలో పాల్గొన్న సీఎం రేవంత్.. కేసీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మేము రైతుభరోసా ఎగ్గొడతామని కేసీఆర్ అంటున్నారని.. ఆయనలాగా తాము మాటతప్పే రకం కాదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఫామ్ హౌస్‌లో మాట్లాడటం కాదు.. చిత్తశుద్ధి ఉంటే, అసెంబ్లీకి రావాలని ఛాలెంజ్ చేశారు.
“కేసీఆర్ ఎగొట్టిన రైతుభరోసా ఇస్తున్నాం. ఏడాదికి రూ.12000 రైతుభరోసా ఇవ్వాలని జనవరి 26న ప్రారంభించాం. మార్చి 31వ తేదీలోపు మీ అకౌంట్లలోకి వేసే పూచీ నాది. రైతుభరోసా ఎగ్గొడతామని కేసీఆర్ అంటున్నారు. నేను ఆయనలాగా ఎగ్గొట్టే రకం కాదు.దళితులకు మూడెకరాలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అంటూ ఎగ్గొట్టారు. పాలమూరు ప్రాజెక్టు కడతానని చెప్పి మాట తప్పావ్. జహంగీర్ పీర్ దర్గాకు, వేములవాడ రాజన్న ఆలయానికి రూ.100 కోట్లు ఇస్తానని మాట తప్పారు. రైతులకు భరోసా, విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఫ్రీ సిలిండర్లు ఇస్తున్నాం.ఆయన కొడితే బలంగా కొడతాడంట. కర్ర లేకుండా సరిగ్గా నిలబడేది నేర్చుకోవాలి ముందు. సోషల్ మీడియాలో నాకు, కేసీఆర్‌కు పోటీపెడితే.. ఆయనకు లైకులు ఎక్కువచ్చాయంట. బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్‌కు, రాఖీసావంత్‌కు పోటీపెడితే.. రాఖీసావంత్‌కే ఎక్కువ లైకులు వచ్చాయి. అంతమాత్రాన రాఖీసావంత్, సల్మాన్ ఖాన్ కంటే గొప్ప అవుతారా? పదేళ్ల పాలనను జనం తిరస్కరిస్తే, ఫామ్‌హౌస్‌లో ఉంటూ సోషల్ మీడియా లైకులు గురించి మాట్లాడుతున్నారు.కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి రావాలి. ఏబీసీడీ వర్గీకరణపై మాట్లాడదాం.. నువ్వా, మేమా తేల్చుకుందాం.. కేసీఆర్ కాలం చెల్లిపోయిన వెయ్యి రూపాయల నోటు. ఆ నోటుకు ఇప్పుడు విలువ లేదు. ఆ నోటు ఉంటే జైళ్లో వేస్తారు. తెలంగాణ సమాజంలో కేసీఆర్ గురించి అడిగేవారు లేరు” అంటూ కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి కౌంటరిచ్చారు.