by Suryaa Desk | Sun, Feb 02, 2025, 07:25 PM
కేంద్ర బడ్జెట్ 2025-26లో తెలంగాణకు మరోసారి తీవ్ర అన్యాయం జరిగిందని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో కనీసం తెలంగాణ పేరు ప్రస్తావన కాడా ఎక్కడా లేదని ఫైరవుతున్నారు. కొత్త కార్యక్రమాలకు, పథకాలకు, విద్యాసంస్థలకు నిధుల కేటాయింపు లేదని అంటున్నారు. ముఖ్యమంత్రి అనేక పర్యాయాలు ఢిల్లీకి వెళ్లి కేంద్రాన్ని కలిసి చేసిన వినతులను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదని ఇది అన్యాయమని కాంగ్రెస్ నేతలు పెదవి విరుస్తున్నారు. విభజన చట్టంలోని అంశాలను, కొత్తగా ప్రతిపాదించిన ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని కోరినా కేంద్రం మెుండి చేయి చూపిందని నిట్టూరుస్తున్నారు. బడ్జెట్ కేటాయింలపై రాష్ట్రం ఎన్నో ఆశలు పెట్టుకుంటే నీళ్లు చల్లారని ఫైరవుతున్నారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జీరో బడ్జెట్ ఫ్లెక్సీ వైరల్ అవుతోంది. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నా.. తెలంగాణకు నిధులు తీసుకురాలేదని బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. తెలంగాణకు గుండు సున్నా ఇచ్చారని ఫైర్ అవుతున్నారు. నిధులు రాబట్టడంలో బీజేపీ, కాంగ్రెస్ పూర్తిగా విఫలమయ్యాయని ఎద్దేవా చేస్తున్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వివక్ష ఫలితంగా బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు.
రూ.50 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేళపెట్టగా.. తెలంగాణకు ప్రత్యేకంగా ఒక్క పైసా కూడా కేటాయించలేదు. రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టునుగానీ, కార్యక్రమాన్నిగానీ ప్రకటించలేదు. రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులున్నా నిధులు సాధించడంలో విఫలమయ్యారు. ‘మోదీ మా బడేభాయ్.. కేంద్రం నుంచి నిధులు ఎలా రాబట్టుకోవాలో మాకు తెలుసు’ అంటూ రేవంత్‌రెడ్డి చెప్పుకున్న గొప్పలన్నీ గప్పాలని తేలిపోయింది.' అని బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది. కాగా, బడ్జెట్ కేటాయింపులపై కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. ‘కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ భాగస్వామి’ అంటూ కిషన్ రెడ్డి, ‘దేశ గతిని మార్చే బడ్జెట్ ఇది’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.