by Suryaa Desk | Sat, Feb 01, 2025, 08:00 PM
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. బడ్జెట్ కేటాయింపులన్నీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు, ఎన్‌డీయే భాగస్వామ్య రాష్ట్రాలకే దక్కాయన్నారు. కేంద్ర జీడీపీలో తెలంగాణ వాటా 5 శాతంగా ఉన్నప్పటికీ ఆమేరకు కూడా నిధులు కేటాయించలేదని అసహనం వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రం నుంచి పన్నులు రూపంలో రూ.26 వేల కోట్లు కేంద్రానికి వెళ్లాయి. గతంలో కంటే 12 శాతం మేర పెరిగినా రాజకీయ కారణాలతో తెలంగాణపై చిన్నచూపు చూశారు. భాజపాకు 8 మంది ఎంపీలను ఇచ్చినా తెలంగాణ ప్రజలకు మోదీ ప్రభుత్వం ద్రోహం చేసింది. బిహార్, దిల్లీ, ఏపీ, గుజరాత్ రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వడం కక్ష సాధింపు కాదా? సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలుమార్లు ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులను కలిసి సహాయం కోసం అభ్యర్థించారు. మెట్రో రెండో దశ ప్రాజెక్టు (76.4 కిలోమీటర్ల) విస్తరణకు కేంద్రం వాటాగా రూ.17,212 కోట్లు కేటాయించాలని కోరినా రూపాయి కూడా ఇవ్వలేదు. ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చెందుతోన్న హైదరాబాద్, శివారు మున్సిపాలిటీలకు సీఎస్‌ఎంపీ కింద భూగర్భ డ్రైనేజీకి నిధులు కేటాయించాలని విన్నవించుకున్నా బడ్జెట్‌లో కేటాయింపులు చేయకుండా అన్యాయం చేశారు’’ అని పేర్కొన్నారు.