by Suryaa Desk | Sun, Feb 02, 2025, 12:26 PM
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్య సమావేశం అయినట్లు వార్తలు రావడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సమావేశానికి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నాయకత్వం వహించారనీ వార్తలు వచ్చాయి.తాజాగా.. ఈ వ్యవహారంపై అనిరుధ్ రెడ్డి స్పందించారు. ఆదివారం ఆయన ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడారు. ''ఎమ్మెల్యేలం సమావేశం అయిన మాట వాస్తవమే. నేను ఏ ఫైల్‌ను రెవెన్యూ మంత్రి దగ్గర పెట్టలేదు. అసలు అది ఏ ఫైల్ అనేది నాగర్‌కర్నూలు ఎంపీ మల్లు రవి చెప్పాలి. నియోజకవర్గాల్లో అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలు ఒకచోట కలిసి మాట్లాడుకుంటే తప్పేంటి. మేమేం రహస్యంగా సమావేశం కాలేదు. కానీ అధిష్టానికి చెప్పాల్సింది చాలానే ఉంది. రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ కలిశాక అన్ని విషయాలు మాట్లాడుతా, అన్ని వివరాలు చెబుతా. నా క్యారెక్టర్‌ను తప్పుగా చూపిస్తే ఊరుకునేదే లేదు. అన్ని ఆధారాలతో పెద్దలతో మాట్లాడుతా'' అని సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉండగా.. నిధుల కేటాయింపులో తమకు అన్యాయం జరుగుతుందని అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొందరు రగిలిపోతున్నట్టు అనిరుధ్ రెడ్డి మాటలు చూస్తుంటే తెలుస్తున్నది. మంత్రులున్న నియోజకవర్గాలకే నిధులు వెళ్తున్నాయి తప్ప .. తమ నియోజకవర్గం రావడం లేదనే ఉద్దేశంతో కొందరు ఎమ్మెల్యేలు భేటీ అయినట్లు తెలుస్తోంది. ఒకరిద్దరు మంత్రులు.. ఎమ్మెల్యేలకు నిధులు విడుదల చేయడం లేదని వారు అభిప్రాయపడినట్టు సమాచారం. కనీస స్థాయిలో తమకు గౌరవం లభించడం లేదని వారు మథనపడినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. అయితే దీనిని కాంగ్రెస్ వ్యతిరేక శక్తులు.. సోషల్ మీడియా వేదికగా తిరుగుబాటు సమావేశంగా చిత్రీకరించి ట్రోల్ చేశాయి. దీంతో ఉలిక్కి పడిన టీపీసీసీ సారథి మహేశ్‌కుమార్‌గౌడ్.. తాజాగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డికి ఫోన్ చేసి రహస్య భేటీలపై ఆరా తీశారు. తాను పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో కలిసి భోజనం చేయాలనే ఉద్దేశంతో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు అనిరుధ్‌రెడ్డి వివరణ ఇచ్చినట్టు సమాచారం.