by Suryaa Desk | Sun, Feb 02, 2025, 05:02 PM
తెలంగాణలో కులగణన, సమగ్ర కుటుంబ సర్వే చేపట్టడం తెలిసిందే. ప్రణాళిక సంఘం నేడు సర్వే నివేదికను మంత్రివర్గ ఉపసంఘానికి అందించింది. 3.54 కోట్ల మందిని సర్వే చేసి ఈ నివేదిక రూపొందించినట్టు ప్రణాళిక సంఘం అధికారులు తెలిపారు. 96.9 శాతం కుటుంబాలను సర్వే చేసినట్టు వివరించారు. 3.1 శాతం మంది సర్వేలో పాల్గొనలేదని వెల్లడించారు. బీసీ జనాభా 55.85 శాతం ఉన్నట్టు నివేదికలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మంత్రివర్గ ఉపసంఘానికి కులగణన సర్వే నివేదిక అందిందని వెల్లడించారు. దేశంలో ఎక్కడా ఇటువంటి సర్వే జరగలేదని చెప్పారు. ఇంత భారీ ప్రక్రియను సజావుగా, కచ్చితత్వంతో నిర్వహించినందుకు సీఎస్ శాంతికుమారి, ఇతర ఐఏఎస్ అధికారులకు, జిల్లా కలెక్టర్లకు, సర్వేలో పాల్గొన్న ఎన్యూమరేటర్లకు ధన్యవాదాలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. 50 రోజుల్లోనే సర్వే పూర్తి చేశామని, కులగణన సర్వే నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడతామని తెలిపారు. రాహుల్ గాంధీ ఆశయం మేరకే సామాజిక, కులగణన సర్వే చేపట్టామని తెలిపారు. దేశంలో బీసీ జనాభా లెక్కించాలనేది రాహుల్ ఆశయమని అన్నారు. సామాజిక న్యాయం కోసమే ఈ సర్వే అని, వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ఆకాంక్ష అని వెల్లడించారు.