by Suryaa Desk | Sun, Feb 02, 2025, 02:17 PM
ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో చిరుతలు, పెద్దపులులు, ఎలుగుబంట్లు వంటి వన్యమృగాల సంచారం గ్రామాల్లో బాగా పెరిగిపోయింది. అటవీ ప్రాంతాలు తగ్గిపోతుండడం, ఆహార సమస్య తలెత్తుతుండడంతో అవి జనావాసాల్లోకి వస్తున్నాయి.ముఖ్యంగా ఆవులు, గేదెలు, కుక్కలు వంటి జంతువులపై చిరుతలు, పెద్దపులులు దాడి చేస్తూ తినేస్తున్నాయి. పశువులు మేపేందుకు వెళ్లిన పలువురు కాపరులు, రైతులపైనా దాడులు చేసిన ఘటనలు అనేకం కనిపిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గతంలో ఎప్పుడో ఓసారి మాత్రమే వన్యమృగాల సంచారం గురించి వార్తలు వినిపిస్తుండేవి. కానీ ఇటీవల కాలంలో రెండు, మూడు రోజులకోసారి చిరుతలు, పెద్దపులుల సంచారంపై కథనాలు వెలువడుతున్నాయి. వాటికి సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారుతున్నాయి.
తాజాగా అటువంటి ఘటనే ఒకటి కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. తిర్యాని మండలం చింతపల్లి గ్రామంలోకి ఓ చిరుత ఆహారం వెత్తుకుంటూ వచ్చింది. అయితే ఎప్పుడూ వేటాడుతూ ఇతర జంతువులను భయపెట్టే చిరుతకు ఈసారి ఉహించని ఘటన ఎదురైంది. తనను వేటాడేందుకు వచ్చిన చిరుతకు ఓ గ్రామ సింహం చుక్కలు చూపించింది. గ్రామ శివారు ప్రాంతంలో ఓ కుక్క నిద్రిస్తోంది. అయితే అక్కడికి వచ్చిన చిరుత దాన్ని వేటాడేందుకు ప్రయత్నించింది. మెల్లిగా అడుగులో అడుగులు వేసుకుంటూ శునకం దగ్గరికి వెళ్లింది. ఇది గమనించిన గ్రామ సింహం చిరుతను చూసి ఒక్కసారిగా ఎదురు తిరిగింది. ఊహించని ఘటనతో చిరుత పరుగులు పెట్టింది. కుక్క సైతం వెంటపడడంతో దగ్గరలో ఉన్న చెట్టుపైకి చిరుత ఎక్కింది.
అయితే శునకం మాత్రం అక్కడ్నుంచి కదలలేదు. గట్టిగా మెురుగుతూ గ్రామస్థులను అప్రమత్తం చేసింది. కుక్క అదే పనిగా చెట్టువైపు చూస్తూ అరుస్తుండడాన్ని స్థానిక యువత గమనించారు. ఏంటా అని చెప్పి దగ్గరికి వెళ్లి చూడగా చెట్టుపై చిరుత కనిపించింది. తీవ్ర భయాందోళనకు గురైన వారంతా గ్రామస్థులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న ప్రజలు పెద్దఎత్తున గుమిగూడారు. పోలీసులు, అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించగా చింతపల్లి గ్రామానికి చేరుకున్నారు. చిరుత పులిని పట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాగా, చిరుతకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.