by Suryaa Desk | Sun, Feb 02, 2025, 05:48 PM
తెలంగాణలో మరికొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో లోకల్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ మేరకు వ్యూహాలకు పదును పెడుతోంది. కాంగ్రెస్ ప్రతిష్ఠను పెంచేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే గాంధీకి రావాలని సీనియర్లకు కబురు పంపింది. తాజాగా.. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డికి ఫోన్ చేశారు. పార్టీ కార్యకర్తలు, నేతలకు దిశానిర్దేశం చేసేందుకు అప్పుడప్పుడు గాంధీభవన్‌కు రావాలని స్పెషల్‌గా రిక్వెస్ట్ చేశారు. గాంధీభవన్‌కు వారానికొకసారైన వచ్చేలా ప్లాన్ చేసుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించినట్లు తెలిసింది.
ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్, బీజేపీ నేతలపై విమర్శలు కురిపిస్తున్నాయి. ప్రజలతో పాటుగా ఎమ్మెల్యేల్లోనూ అసంతృప్తి ఉందని ప్రచారం చేస్తున్నాయి. రెండ్రోజుల క్రితం ఓ ఎమ్మెల్యే ఫాంహౌస్‌లో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భేటీ అయినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అలర్ట్ అయిన పీసీసీ.. జానారెడ్డితో సహా సీనియర్లను రంగంలోకి దింపుతోన్నట్లు తెలుస్తోంది.
ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారన్న వార్తలపై ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తాము ఎటువంటి రహస్య భేటీలో పాల్గొనలేదని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తాజాగా స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై కుట్ర జరుగుతోందని రాజేందర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌కు లేఖ రాశారు. తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానన్నారు. సీఎంను కలిసి ఈ అంశంపై ఫిర్యాదు చేస్తానని అన్నారు.