by Suryaa Desk | Mon, Feb 03, 2025, 03:17 PM
వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ( తెలిపారు. సోమవారం ఆమె వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయమైన నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 3 నుంచి 10 వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపడుతున్న అభ్యర్థుల నుంచి నామినేషన్‌లు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఈ నెల 8, 9 తేదీల్లో ప్రభుత్వ సెలవు దినాలలో నామినేషన్లు స్వీకరించబోమని చెప్పారు. ఈ నెల 11న నామినేషన్ల పరిశీలన, 13న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని, ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతుందని తెలిపారు. మార్చి 3న ఓట్ల లెక్కింపు ఉంటుందని కలెక్టర్ చెప్పారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు తాను రిటర్నింగ్ అధికారిగా, నల్గొండ రెవెన్యూ అదనపు కలెక్టర్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించనున్నట్లు తెలిపారు. నామినేషన్ల సందర్భంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. క్లరికల్ అంశాలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చని చెప్పారు. అభ్యర్థులు అఫిడవిట్ సమర్పణ, అన్నేక్సర్ 26, ఫోటోల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.