by Suryaa Desk | Sat, Feb 01, 2025, 08:14 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ, "కేసీఆర్ కొడితే ఎలా ఉంటుందో నీ మాజీ గురువును అడుగు, నీ ప్రస్తుత గురువు రాహుల్ గాంధీ తల్లిని అడుగు" అన్నారు. వారి మెడలు వంచి తెలంగాణ సాధించిన ఘనత కేసీఆర్‌ది అని పేర్కొన్నారు. కేసీఆర్ కొట్టిన దెబ్బ తిన్నవారిని అడిగితే ఎలా ఉంటుందో చెబుతారని ఎద్దేవా చేశారు.కేసీఆర్ కర్ర లేకుండా నిలబడతారని, కానీ రేవంత్ రెడ్డి మొదట కమీషన్ లేకుండా పాలించాలని వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. కేసీఆర్‌తో రేవంత్ రెడ్డికి పోలిక ఏమిటని ప్రశ్నించారు. కేసీఆర్ అంటే హిస్టరీ రేవంత్ రెడ్డి అంటే లాటరీ అని చురక అంటించారు. టిక్కెట్ లేకుండానే లాటరీ గెలిచిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. తప్పిదారి ముఖ్యమంత్రి అయ్యారన్నారు.కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు పైసా తీసుకురాని బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. జాతీస్థాయిలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేకపోయారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెరో ఎనిమిది ఎంపీలను ఇస్తే రాష్ట్రానికి తెచ్చింది గుండు సున్నా అన్నారు.ఇతర రాష్ట్రాలకు నిధుల వరద పారిందన్నారు. బీజేపీతో రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందం కుదుర్చుకున్నందునే బడ్జెట్‌లో రెండోసారి కూడా చిల్లిగవ్వ రాలేదన్నారు. జాతీయ పార్టీలను గెలిపిస్తే నిండా ముంచారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి 30 సార్లు ఢిల్లీ వెళ్లింది నిధులు తెచ్చేందుకు కాదని తేలిపోయిందన్నారు.