by Suryaa Desk | Sat, Feb 01, 2025, 08:17 PM
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, మోడల్ స్కూళ్లలో పదో తరగతి చదువుతూ ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యార్థులకు సాయంత్రం పూట అల్పాహారం అందించాలని నిర్ణయించింది. ఇది నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో గల ప్రభుత్వ ఆలియా మోడల్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయులు స్నాక్స్‌ను అందించారు.పదో తరగతిలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఆకలితో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు సాయంత్రం అల్పాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20 వరకు పాఠశాలలు నడిచే 38 రోజుల పాటు అల్పాహారం ఇవ్వనున్నారు.