by Suryaa Desk | Sun, Feb 02, 2025, 08:41 PM
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను నిర్మాత బన్నీ వాసు పరామర్శించారు. రెండు నెలలుగా సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో బాలుడు చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీతేజ్‌కు అందుతున్న చికిత్స గురించి బన్నీ వాసు అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తీసుకెళ్తామని చెప్పారు. శ్రీతేజ్ వైద్య ఖర్చులు భరిస్తామని తెలిపారు.తొమ్మిదేళ్ల బాలుడు శ్రీతేజ్ దాదాపు రెండు నెలలుగా ఆసుపత్రికే పరిమితమయ్యాడు. అయినా బాలుడి ఆరోగ్య పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు. తొక్కిసలాట తర్వాత బాలుడిని పక్కకు తీసుకెళ్లిన పోలీసులు సీపీఆర్ చేశారు. వెంటనే సికింద్రాబాద్ కిమ్స్‌కు తరలించారు. కొన్ని రోజులపాటు ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. సొంతంగా ఆక్సిజన్ పీల్చుకోవడంతో వెంటిలేటర్‌ను తొలగించి ప్రత్యేక గదికి మార్చారు. అప్పటి నుంచి అతను ఆసుపత్రిలో మంచానికే పరిమితమయ్యాడు. పేరుపెట్టి పిలిచినా కళ్లు తెరిచి చూడలేడు. నోరు విప్పి మాట్లాడలేడు. ఇప్పటివరకు ముక్కు వద్ద అమర్చిన సన్నని గొట్టం ద్వారానే లిక్విడ్ ఆహారం అందిస్తున్నారు. వైద్య సిబ్బంది ఫిజియోథెరపీ చేపడుతున్నారు. అయినా ఆరోగ్య పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు. ఎప్పుడు కోలుకుంటాడో వైద్యులు కూడా చెప్పలేని పరిస్థితి. శరీరంలో ఇతర జీవ ప్రక్రియలన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ శ్రీతేజ్ నుంచి స్థిరమైన ప్రతిస్పందనలు ఉండటం లేదని వైద్యులు చెబుతున్నారు.