by Suryaa Desk | Sun, Feb 02, 2025, 11:38 AM
రాష్ట్రంలో వరుస అగ్ని ప్రమాదాలు (Fire Accidens) నగరవాసులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎప్పుడు ఎటువైపు నుంచి అగ్నిప్రమాదం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు.తాజాగా పాతబస్తి (Old Town), జీడిమెట్ల (Jeedimetla)లో అగ్నిప్రమాదాలు జరిగాయి. పాతబస్తి, కిషన్ బాగ్ ఎక్స్ రోడ్ సమీపంలోని ఆదివారం తెల్లవారుజామున ఓ భవనంలోని సెల్లార్‌లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, కిషన్ బాగ్ కార్పరేటర్ సంఘటన ప్రదేశానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆ భవనంలో ఉన్న వారిని పోలీసులు క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్ని ప్రమాదం వల్ల భవనం పై అంతస్తులోనూ దట్టమైన పొగ అలుముకుంది. బహదూర్ పురా ఎంఐఎం ఎమ్మెల్యే దగ్గరుండి సహాయక చర్యలు సమీక్షిస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
కాగా పాతబస్తీలో తరుచూ అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. గత కొద్ది రోజుల క్రితం మాదన్నపేట చౌరస్తాలో ఓ తుక్కు గోదాంలో మంటలు చెలరేగాయి. మంటలను అదుపు చేయడానికి.. అగ్నిమాపక సిబ్బంది దాదాపు ఆరుగంటల పాటు శ్రమించారు. ఇక రానున్నది వేసవికాలం కావడంతో అగ్నిప్రమాదాలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని.. అందరూ జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.మరోవైపు బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాసరి సంజీవయ్య కాలనీలోని ఓ ఇంటిలో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. జలగం సాయి సత్య శ్రీనివాస్ (32) ఇంటిలో మంటలు చెలరేగడంతో తీవ్రంగా గాయపడిన అతను అక్కడిక్కడే మృతి చెందాడు. ఆంధ్రప్రదేశ్, రాజమండ్రికి చెందిన సత్య శ్రీనివాస్, పటాన్‌చెరు, రుద్రారంలోని ఓ కెమికల్ కంపెనీలో పని చేస్తున్నాడు. మృతుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడా, లేక ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలకు అగ్నికి ఆహుతయ్యాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.