by Suryaa Desk | Sat, Feb 01, 2025, 02:49 PM
రాత్రి సమయంలో ఓ కారు బీభత్సం సృష్టించి బాలుడు మృతికి కారణమైన సంఘటన మేడిపల్లి పీఎస్ పరిధిలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… మహబూబాద్ జిల్లా, పెద్దగూడూరు మండలం గుండెంగా తేజావత్ రాంసీంగ్ తండా గ్రామానికి చెందిన వాంకుడోతు అశోక్ అనుషా దంపతులు పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని సీపీఅర్ఐ రోడ్డు ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఒక బిల్డింగ్ వద్ద వాచ్ మెన్ గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.ఈక్రమంలో శుక్రవారం రాత్రి 11గంటల సమయంలో టీఎస్ 10 ఈపీ 7183 (ఐ 20 స్పోర్ట్స్) కారు అతివేగంగా వచ్చి గుడిసెలో నిద్రిస్తున్న వాచ్ మెన్ కుమారుడు అక్షీత్ (4) ను ఢీకోట్టింది. దీంతో గుడిసెలో నిద్రిస్తున్న బాలుడి తలకు బలమైన గాయం కావడంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమించడంతో అక్కడి నుండి గాంధీ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నామని ఎస్ఐ తిరుపతయ్య తెలిపారు. బాలుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీకి తరలించారు.