by Suryaa Desk | Sun, Feb 02, 2025, 05:45 PM
సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన సంతోష్ అనే వ్యక్తి చేనేత కార్మికుడు. అతడికి భార్య, ముగ్గురు ఆడ పిల్లలు, ఓ కుమారుడు సంతానం. సంతోష్‌ది నిరుపేద కుటుంబం కావటంతో సొంతిల్లు కట్టుకోలేదు. పట్టణంలోని అద్దె ఇంట్లోనే ఉంటూ చేనేత కార్మికుడిగా జీవనం సాగిస్తున్నాడు. అయితే గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సంతోష్.. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతి చెందాడు. దీంతో హాస్పిటల్ సిబ్బంది మృతదేహాన్ని అప్పగించారు. అయితే వారికి పట్టణంలో సొంతిల్లు లేదు. అద్దె ఇంట్లోకి తీసుకువెళ్లలేని పరిస్థితి.
ఏం చేయాలో తోచని ఆ కుటుంబ సభ్యులు.. అంబులెన్స్‌లోనే రాత్రంతా శవాన్ని ఉంచారు. మృతదేహంతో పాటు కుటుంబ సభ్యులు కూడా రాత్రంతా నడిరోడ్డుపైనే గడిపారు. ఈ ఘటన చూసి చలించి పోయిన కొందరు స్థానికులు తోచినంత సాయం చేసి ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు. విషయం తెలుసుకున్న సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి సంతోష్ కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా కల్పించారు. ప్రభుత్వం తరుపున అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. కాగా, జిల్లా కలెక్టర్ ఘటనపై స్పందించారు. ఆ కుటుంబ పరిస్థితికి చలించిపోయి డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేశారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో స్థానికులు, అధికారుల సాయంతో సంతోష్ అంత్యక్రియలు పూర్తి చేశారు.