|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 07:58 PM
తెలంగాణలోని నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందించే లక్ష్యంతో హైదరాబాద్ సనత్‌నగర్‌లో ప్రభుత్వం తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ హాస్పిటల్ ప్రారంభానికి ఇటీవల ముహుర్తం కూడా ఖరారు చేశారు. ఉగాది పండుగ రోజున అంటే మార్చి 19న ఈ ప్రతిష్టాత్మక 1000 పడకల ఆసుపత్రిని ప్రారంభించి ప్రజలకు అంకితం చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయింది.
ఈలోగా సివిల్ పనులు, ఎక్విప్‌మెంట్ ట్రయల్స్ అన్నీ పూర్తి చేసి హాస్పిటల్‌ను వైద్య సేవలు అందించేందుకు సిద్ధం చేయాలని ఇప్పటికే ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఇక టిమ్స్ హాస్పిటల్ అందుబాటులోకి వస్తే తెలంగాణ ప్రభుత్వ వైద్యరంగంలో ఒక సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. టిమ్స్ ఆసుపత్రిలో అత్యాధునిక 'న్యూమాటిక్ ట్యూబ్ సిస్టమ్' అందుబాటులోకి రానుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ తరహా సాంకేతికతను ప్రవేశపెట్టడం రాష్ట్రంలోనే ఇదే తొలిసారి
న్యూమాటిక్ ట్యూబ్ సిస్టమ్ అంటే ఏంటి..?
సాధారణంగా కార్పొరేట్ ఆసుపత్రుల్లో కనిపించే ఈ విధానంలో గాలి పీడనం ద్వారా పనిచేసే పైప్‌లైన్ నెట్‌వర్క్ ఉంటుంది. దీని ద్వారా బ్లడ్ శాంపిల్స్ లేదా ఇతర మెడికల్ శాంపిల్స్‌ను హాస్పిటల్‌లోని ఒక విభాగం నుంచి మరొక విభాగానికి సెకన్ల వ్యవధిలో చేరవేయవచ్చు. అత్యవసర సమయాల్లో సిబ్బంది స్వయంగా ల్యాబ్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా, నిర్దేశిత స్టేషన్లలో శాంపిల్స్ ఉంచితే అవి నేరుగా ల్యాబ్‌కు చేరుకుంటాయి. ల్యాబ్ టెక్నీషియన్లు వెంటనే టెస్టులు నిర్వహించి, డిజిటల్ రూపంలో రిపోర్టులను క్షణాల వ్యవధిలోనే డాక్టర్లకు పంపుతారు. దీనివల్ల రోగుల నిరీక్షణ సమయం గణనీయంగా తగ్గుతుంది.
ముఖ్యంగా యాక్సిడెంట్లు, గుండెపోటు వంటి అత్యవసర సమయాల్లో లేదా ఆపరేషన్ థియేటర్లలో రోగికి రక్తం ఎక్కించాల్సి వచ్చినప్పుడు ఈ వ్యవస్థ ప్రాణదాతగా మారుతుంది. తక్కువ సమయంలోనే క్లినికల్ నిర్ణయాలు తీసుకునేందుకు ఇది డాక్టర్లకు తోడ్పడుతుందని టిమ్స్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ మహబూబ్ ఖాన్ వెల్లడించారు. ప్రభుత్వ వైద్య సేవలను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈ ఆసుపత్రిని రూపొందించినట్లు మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ ఏ నరేంద్ర తెలిపారు. న్యుమాటిక్ ట్యూబ్ సిస్టమ్‌తో పాటు, ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉండేందుకు ప్రత్యేకమైన 'డర్టీ కారిడార్స్' వంటి నూతన డిజైన్లను ఈ ఆసుపత్రిలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సనత్‌నగర్ టిమ్స్ అందుబాటులోకి వస్తే సామాన్యులకు అత్యున్నత స్థాయి సాంకేతిక వైద్య సేవలు వేగంగా అందనున్నాయని అన్నారు.