|
|
by Suryaa Desk | Thu, Feb 19, 2026, 05:12 PM
టిఆర్ఎస్ తరపున గెలుపొంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కచ్చితంగా అనర్హత వేటు వేస్తారనే నమ్మకం తమకు ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. దానం నాగేందర్ పార్టీ మారారని నిరూపించే అన్ని ఆధారాలను స్పీకర్ కు తాము అందజేశామని తెలిపారు. దానంపై వేటు వేసేందుకు ఇంతకంటే ఏమీ అవసరం లేదని చెప్పారు. 2024 మార్చి 15న దీపాదాస్ మున్షీ, రేవంత్ రెడ్డి సమక్షంలో దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారని ఆ పార్టీలో చేరారని తెలిపారు. 2024 మార్చి 21న కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఎంపీ అభ్యర్థుల జాబితాలో సికింద్రాబాద్ అభ్యర్థిగా దానం నాగేందర్ పేరును ప్రకటించారని అన్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన దానం 4.29 లక్షల ఓట్లు పొందారని చెప్పారు. ఈ ఆధారాలన్నీ స్పీకర్ కు అందించామని తెలిపారు.ఒకవైపు రాజ్యాంగాన్ని బీజేపీ తుంగలో తొక్కుతోందని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారని, మరోవైపు తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తోందని కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. దానం నాగేందర్ పై వేటు పడటం ఖాయమని, ఖైరతాబాద్ కు ఉపఎన్నిక రావడం కూడా ఖాయమని చెప్పారు.