|
|
by Suryaa Desk | Thu, Feb 26, 2026, 04:01 PM
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దిగ్గజ సంస్థ శాంసంగ్ మరో సంచలనానికి తెరలేపింది. తన ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో భాగంగా గెలాక్సీ S26, గెలాక్సీ S26+, గెలాక్సీ S26 అల్ట్రా మోడళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. ముఖ్యంగా గెలాక్సీ S26 అల్ట్రాలో అమర్చిన ఒక అద్భుతమైన ఫీచర్ ఇప్పుడు టెక్ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. అదే 'ప్రైవసీ డిస్‌ప్లే'. ఈ ఫీచర్ వలన, ఫోన్ వాడుతున్న వ్యక్తికి తప్ప పక్కనుంచి చూసే వారికి స్క్రీన్‌పై ఉన్న సమాచారం దాదాపు కనిపించదు.అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఫిబ్రవరి 25న జరిగిన 'గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2026' కార్యక్రమంలో ఈ కొత్త ఫోన్లను శాంసంగ్ ఆవిష్కరించింది. ప్రపంచంలోనే తొలిసారిగా ఒక స్మార్ట్‌ఫోన్‌లో అంతర్నిర్మితంగా 'ప్రైవసీ డిస్‌ప్లే' టెక్నాలజీని అందించడం గమనార్హం. ఈ ఫీచర్‌ను ఆన్ చేసినప్పుడు, ఫోన్‌ను నేరుగా చూస్తున్న వారికి మాత్రమే స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. పక్కన కూర్చున్న వారు లేదా వెనుక నుంచి దొంగచూపులు చూసేవారికి స్క్రీన్ దాదాపు నల్లగా కనపడుతుంది. బహిరంగ ప్రదేశాల్లో ప్రయాణిస్తున్నప్పుడు వ్యక్తిగత చాట్స్, బ్యాంకింగ్ వివరాలు, ఇతర సున్నితమైన సమాచారానికి ఇది మరింత భద్రత కల్పిస్తుంది.