|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 03:11 PM
సింహగిరి శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి వార్షిక ఉత్సవాలకు తొలి అడుగు పడనుంది. ఫాల్గుణ పౌర్ణమిని పురస్కరించుకుని ఈ నెల 3వ తేదీన స్వామివారి డోలోత్సవం వైభవంగా జరగనుంది. అయితే, అదే రోజు చంద్రగ్రహణం కారణంగా రోజంతా భక్తులకు స్వామివారి దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) జె.వెంకటరావు స్పష్టం చేశారు.సంప్రదాయం ప్రకారం డోలోత్సవం రోజునే స్వామివారి సోదరి, అడివివరం గ్రామ దేవత అయిన శ్రీపైడితల్లి అమ్మవారి కుమార్తెతో అప్పన్న స్వామికి పెళ్లిచూపులు జరుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. స్వామివారి కల్యాణోత్సవానికి ముందు జరిగే ఈ వేడుక కోసం భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.ఈ ఉత్సవం కోసం తెల్లవారుజామున 4 గంటలకు స్వామివారు దేవేరుల సమేతంగా పల్లకీలో కొండ దిగువన ఉన్న పుష్కరిణి ఉద్యాన మండపానికి తరలివస్తారు. అక్కడ స్వామివారిని ఉయ్యాలలో అధిష్ఠింపజేసి డోలోత్సవం నిర్వహిస్తారు. అనంతరం చూర్ణోత్సవం, వసంతోత్సవంలో భాగంగా ఆలయ సిబ్బంది, గ్రామస్థులు రంగులు చల్లుకుని సంబరాలు చేసుకుంటారు. ఉదయం 6 గంటలకు గ్రామ తిరువీధి జరుగుతుంది.మరోవైపు, 3న మధ్యాహ్నం 3:21 నుంచి సాయంత్రం 6:49 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుందని ఈవో తెలిపారు. ఈ కారణంగా ఆ రోజు ఆలయంలో భక్తుల దర్శనాలతో పాటు అన్ని ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు ప్రకటించారు.