|
|
by Suryaa Desk | Thu, Feb 19, 2026, 04:13 PM
తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 26 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారభించాలని రేవంత్ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈనెల 23న తెలంగాణ కేబిన్ట సమావేశం కానుండగా.. ఆ భేటీలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు కసరత్తు పూర్తి చేసిన ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈనెల 28న ఆర్థిక మంత్రి హోదాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది.
గత బడ్జెట్ కంటే ఈసారి అన్ని శాఖలకు కేటాయింపులు భారీగా ఉండే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా ప్రజా సంక్షేమ పథకాలు, వ్యవసాయం మౌలిక సదుపాయాల కల్పనకు ఈ బడ్జెట్‌లో పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్‌పై సభ్యులు సమగ్రంగా చర్చించేందుకు వీలుగా అసెంబ్లీ సమావేశాలను 15 రోజుల పాటు నిర్వహించాలని రేవంత్ ప్రభుత్వం యోచిస్తోంది. శాసనసభ, శాసనమండలిలో ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలకు సమాధానం ఇవ్వడంతో పాటుగా.. పెండింగ్‌లో ఉన్న పలు కీలక బిల్లులను కూడా ఈ సమావేశాల్లోనే ఆమోదించుకోవాలని అధికార పక్షం భావిస్తున్నట్లు సమాచారం.
2025-26కు సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్‌ను గతేడాది మార్చిలో ప్రవేశపెట్టారు. కానీ ఈసారి ఫిబ్రవరిలోనే బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రెడీ అయ్యారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.3,04,965 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2,26,982 లక్షల కోట్లు కాగా.. మూలదన వ్యయం రూ. 36,504 వేల కోట్లు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ ఇదే. ఈసారి బడ్జెట్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శాఖలవారీగా చూస్తే.. అత్యధికంగా వ్యవసాయ రంగానికి రూ. 24,439 కోట్లు, పంచాయతీ & రూరల్ డెవలప్‌మెంట్ రూ.31,605 కోట్లు కేటాయించారు.
గతంలో మాదిరిగానే.. ఈసారి కూడా వ్యవసాయ, పంచాయతీ, రూరల్ డెవలప్‌మెంట్ శాఖలకు పెద్దపీట వేయనున్నట్లు సమాచారం. దాంతో పాటు.. రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రీజినల్ రింగు రోడ్డు, రేడియల్ రోడ్లు, గృహజ్యోతి 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అమలుకు ఇంధన శాఖకు నిధులు కేటాయించనున్నట్లు తెలిసింది.