|
|
by Suryaa Desk | Thu, Feb 19, 2026, 05:34 PM
ఈ మధ్య కాలంలో సంచలనం సృష్టించిన ఐటీ ఉద్యోగిని విజయారెడ్డి, ఆమె ఇద్దరు పిల్లల ఆత్మహత్యల కేసు కొలిక్కి వచ్చింది. ఇది పూర్తిగా మానసిక ఒత్తిడి కారణంగా జరిగిన ఆత్మహత్యేనని, దీని వెనుక మరెవరి ప్రమేయం లేదని పోలీసులు నిర్ధారించారు. మృతురాలి కుటుంబ సభ్యులు కూడా తమకు ఎలాంటి అనుమానాలు లేవని పోలీసులకు వాంగ్మూలం ఇవ్వడంతో ఈ కేసును మూసివేశారు.గత నెల 31న అర్ధరాత్రి దాటాక చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో విజయారెడ్డి తన కుమారుడు విశాల్ రెడ్డి, కుమార్తె చేతనరెడ్డితో కలిసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఆమె ప్రయాణించిన మార్గంలోని సీసీటీవీ ఫుటేజీని, సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లను ఫోరెన్సిక్ ల్యాబ్‌లో విశ్లేషించారు. తొలగించిన వాట్సాప్ చాటింగ్‌ను కూడా రిట్రీవ్ చేసి పరిశీలించారు. ఆమె రాసిన సూసైడ్ నోట్‌లోని చేతిరాతను సోదరుడి ద్వారా నిర్ధారించుకున్నారు.విజయారెడ్డి భర్త దుబాయ్‌లో ఉద్యోగం చేస్తుండగా, పిల్లలిద్దరూ హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్నారు. దీంతో ఆమె ఒంటరితనంతో బాధపడుతున్నట్లు స్నేహితులతో తరచూ చెప్పేవారని పోలీసులు గుర్తించారు. గత రెండు నెలలుగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని, తాను లేకపోతే పిల్లలు అనాథలవుతారనే ఆవేదనతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు దర్యాప్తులో తేలిందని అధికారులు స్పష్టం చేశారు.