|
|
by Suryaa Desk | Thu, Feb 26, 2026, 01:51 PM
పటాన్చెరు : ప్రతి విద్యార్థి జీవితంలో 10వ తరగతి పరీక్షలు అత్యంత కీలకమని, ఇష్టపడి చదివి.. అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు సూచించారు. గురువారం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్లో.. పటాన్చెరు, జెపి కాలనీ డివిజన్లతో పాటు ఇస్నాపూర్ మున్సిపాలిటీ, ఇంద్రేశం మున్సిపాలిటీ, పటాన్చెరు మండల పరిధిలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి విద్యనభ్యసిస్తున్న 3000 వేల మంది విద్యార్థినీ విద్యార్థులకు తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన వ్యక్తిత్వ వికాస ప్రేరణ తరగతులను ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైన పదవ తరగతి పరీక్ష సమయంలో ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి అన్న అంశంపై ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు చంద్రయ్యచే ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పరీక్షలు పూర్తయ్యే వరకు ఇంట్లో ఫోన్లు, టీవీలకు పిల్లలను దూరంగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం సొంత నిధులచే కొనుగోలు చేసిన పరీక్ష మెటీరియల్ విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి నాగేశ్వర రావు నాయక్, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, ప్రైవేట్ పాఠశాలల హెడ్ మాస్టర్లు, కరస్పాండెంట్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.