|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 03:14 PM
కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ ఇవాళ తెలంగాణలో పర్యటించారు. తెలంగాణ, ఏపీ కాంగ్రెస్ పార్టీల రాజకీయ వ్యవహారాల కమిటీల (పీఏసీ) సంయుక్త సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వికారాబాద్‌లోని ఎస్‌ఏపీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఈ సమావేశం జరిగింది. పార్టీ సంస్థాగత బలోపేతం, ముఖ్యంగా తెలంగాణలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలపై ఈ పర్యటనలో ప్రధానంగా చర్చలు జరిగాయి.ఇవాళ ఉదయం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో కలిసి శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి సీఎం రేవంత్‌తో కలిసి ఆయన వికారాబాద్‌కు బయలుదేరారు. వికారాబాద్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాహుల్‌కు స్వాగతం పలికారు.పీఏసీ సమావేశం అనంతరం రాహుల్ గాంధీ అనంతగిరి హిల్స్‌లోని హరిత రిసార్ట్‌కు వెళ్లారు. అక్కడ తెలంగాణ, ఏపీకి చెందిన నూతన డీసీసీ అధ్యక్షుల కోసం ఏర్పాటు చేసిన 10 రోజుల శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో ఈ శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులను ఉద్దేశించి రాహుల్ ప్రసంగించి, పార్టీని బలోపేతం చేయడానికి సమర్థవంతంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.