|
|
by Suryaa Desk | Mon, Feb 16, 2026, 09:57 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును.. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశం కావడం రాజకీయాల్లో తీవ్ర ఆసక్తిని కలిగిస్తోంది. అమరావతిలోని ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి వెళ్లిన తుమ్మల.. ఆయనతో భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య జరిగిన భేటీలో రెండు రాష్ట్రాలకు మధ్య పలు ముఖ్యమైన అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణ సరిహద్దుగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి చర్చించినట్లు సమాచారం. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజనలో భాగంగా ఏపీలో కలిపిన 5 గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపడానికి సహకరించాలని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు.
అదే సమయంలో తిరుమల శ్రీవారి సన్నిధిలో తెలంగాణకు 5 ఎకరాల స్థలం కేటాయించాలని సీఎం చంద్రబాబును తుమ్మల కోరారు. అదే సమయంలో ఖమ్మంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆలయ నిర్మాణానికి సహకరించాలని సీఎం చంద్రబాబును మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఖమ్మం జిల్లా పెద్దవాగు పునర్నిర్మాణానికి అయ్యే ఖర్చులో 85 శాతం నిధులను విడుదల చేయాలని కోరారు. మరోవైపు.. సత్తుపల్లి, కొవ్వూరు రైల్వేలైన్, పెనుబల్లి, అమరావతి రైల్వే లైన్ నిర్మాణానికి ప్రయత్నాలు ముమ్మరం చేయాలని అడిగారు. పోలవరం ప్రాజెక్టులో భాగంగా భద్రాచలం ముంపునకు గురి కాకుండా ఉండేందుకు నిర్మించిన కరకట్టకు సంబంధించి.. ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన భూభాగానికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఏపీలో కలిపిన 5 గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేయడం.. పెద్దవాగు ప్రాజెక్టుతోపాటు.. పలు రైల్వే లైన్లు, నేషనల్ హైవేలపై చంద్రబాబుతో తుమ్మల చర్చించారు. ఏలూరు-కొత్తగూడెం, జగ్గయ్యపేట జాతీయ రహదారి పనులను వేగంగా పూర్తి చేయడం కోసం చొరవ చూపాలని పేర్కొన్నారు.
భద్రాచలం అభివృద్ధి చెందడంలో ఆ 5 గ్రామాలు చాలా కీలకమని.. చంద్రబాబుకు తుమ్మల వివరించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పురుషోత్తపట్నం, కన్నాయిగూడెం, ఉష్ణ గుండాల, ఎటపాక, పిచుకలపాడు గ్రామాలను తెలంగాణలో కలపాల్సిన అవసరం ఉందని.. మంత్రి తుమ్మల గతంలోనే కేంద్ర హోం శాఖకు లేఖ రాయడం గమనార్హం.
భద్రాచలం పట్టణం ఒక్కటి మాత్రమే తెలంగాణ భూభాగంలోనే ఉండగా.. మిగిలిన గ్రామాలు ఏపీలోకి వెళ్లాయని పేర్కొన్నారు. ఆ ఐదు గ్రామాల ఆవాసాలు భౌగోళికంగా రెండు వైపులా తెలంగాణ భూముల మధ్య ఉన్నాయని వెల్లడించారు. గోదావరి నది, రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాలు ఉండటంతో.. పాలన పరంగా కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయనే వాదన ఉందని గుర్తు చేశారు.