|
|
by Suryaa Desk | Thu, Feb 19, 2026, 04:02 PM
పటాన్చెరు : బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల సందర్భంగా ఈ నెల 21న పటాన్చెరు పట్టణంలో భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సేవాలాల్ జయంతి ఏర్పాట్లపై ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈనెల 21న నియోజకవర్గ కేంద్రమైన పటాన్చెరులో సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని తాండాల నుండి ప్రజలు వేడుకలకు హాజరయ్యేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలని కోరారు. శనివారం ఉదయం 8 గంటలకు పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానం నుండి జిఎంఆర్ కన్వెన్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించబోతున్నట్లు తెలిపారు. అనంతరం సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ వేడుకలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. తండాల నుండి ప్రత్యేక బస్సులు సైతం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ సమావేశంలో ఎమ్మార్వోలు హరి బాబు, సరస్వతి, వెంకటేష్, అమీన్పూర్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్, మున్సిపల్ కమిషనర్లు తిరుపతి, వెంకటరామయ్య, దశరథ్, మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు నాయక్, ప్రధాన ఉపాధ్యాయులు పిపి రాథోడ్, సిడిపిఓ జయరాం నాయక్ , మాజీ కౌన్సిలర్లు లచ్చి రామ్ నాయక్, దశరథ్ రెడ్డి, బంజారాల సంక్షేమ సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.