|
|
by Suryaa Desk | Tue, Mar 03, 2026, 02:31 PM
నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకున్నారు. వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్‌లో ఆయన చానెల్ 3 కోట్ల (30 మిలియన్ల) సబ్‌స్క్రైబర్ల మైలురాయిని దాటింది. దీంతో ప్రపంచంలోని ప్రస్తుత, మాజీ దేశాధినేతల్లో యూట్యూబ్‌లో అత్యధిక సబ్‌స్క్రైబర్లు కలిగిన నేతగా ఆయన తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నారు. ఈ ఘనతతో డిజిటల్ కమ్యూనికేషన్‌లో మోదీకి ఉన్న పట్టు స్పష్టమవుతోంది.ప్రపంచవ్యాప్తంగా ఇతర నేతలతో పోలిస్తే మోదీ భారీ ఆధిక్యంలో ఉన్నారు. ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోకు కేవలం 66 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు మాత్రమే ఉన్నారు. ఇది మోదీ సబ్‌స్క్రైబర్ల సంఖ్యలో దాదాపు నాలుగో వంతు మాత్రమే. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పోలిస్తే ప్రధాని మోదీకి ఏకంగా ఏడు రెట్లు ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్లు ఉండటం గమనార్హం. దేశీయంగా చూస్తే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ యూట్యూబ్ చానెల్ కన్నా మోదీ చానెల్‌కు సుమారు మూడు రెట్లు ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), భారత జాతీయ కాంగ్రెస్ (INC) పార్టీల అధికారిక చానెళ్ల కన్నా కూడా మోదీ వ్యక్తిగత చానెల్ సబ్‌స్క్రైబర్లు నాలుగు రెట్లు అధికంగా ఉన్నారు.