|
|
by Suryaa Desk | Mon, Feb 16, 2026, 08:29 PM
సమస్యను పరిష్కరించుకోవడంలో సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌మున్సిపాలిటీలోని చక్రపురి కాలనీవాసులు ఆదర్శంగా నిలిచారని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు అన్నారు. సమస్యలపై ఫిర్యాదు చేయడమే కాదు.. వాటి పరిష్కారానికి సంబంధిత పత్రాలను అందజేసి అధికారులకు సహకరించిన తీరు అభినందనీయమన్నారు. 20 ఏళ్ల సమస్యను హైడ్రా పరిష్కరించినందుకు హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారిని అభినందించడానికి తాము వస్తే.. మాకు సత్కారం చేస్తారేంటి సార్ అంటూ చక్రపురి కాలనీవాసులు ఉబ్బి తబ్బిబ్బయ్యారు. సమస్యలతో సతమతం అవ్వడం కాదు.. వాటి పరిష్కారానికి మీలా ప్రతి కాలనీ సంక్షేమ సంఘం ప్రయత్నించాలని హైడ్రా కమిషనర్ సూచంచారు. స్థానికంగా మీతో కలిసి సమస్యను పరిష్కరించడంలో హైడ్రా ఇన్‌స్పెక్టర్ బాలగోపాల్ గారు కూడా అభినందనీయుడే అంటూ కమిషనర్ కొనియాడారు. ఇదంతా హైడ్రా ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగింది.
మా సమస్యను పరిష్కరించాలంటూ తిరగని కార్యాలయం లేదు.. కలవని అధికారి లేరు. ఇలాంటి తరుణంలో హైడ్రా కార్యాలయానికి వచ్చి ప్రజావాణిలో ఫిర్యాదు చేశాం. హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు నేరుగా ఫిర్యాదును పరిశీలించడమే కాదు.. చక్రపురి కాలనీకి వచ్చి క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులతో విచారించారు. తర్వాత ఇరు పక్షాలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇరు పక్షాల సమక్షంలోనే పత్రాలను పరిశీలించారు. 1985లో 80 ఎకరాల్లో 750 ప్లాట్లతో వేసిన లే ఔట్‌తో పాటు.. అవతలి వారు అందజేసిన పత్రాలను తనిఖీ చేశారు. 1253.8 గజాల పార్కు స్థలం కబ్జాకు గురైందని నిర్ధారించుకున్నారు. పక్కనే వ్యవసాయ భూమి ఉన్న వారు.. మా లే ఔట్‌లోకి మూడున్నర ఎకరాల మేర జరిగి పార్కులు, రహదారులు, ప్లాట్లు కబ్జా చేసినట్టు గుర్తించారు. వెనువెంటనే పార్కుకు హైడ్రా ఫెన్సింగ్ వేశారు. దీంతో పార్కుతో పాటు రహదారుల కబ్జాలపై స్పష్టత వచ్చింది. అలాగే 30 ప్లాట్ల కబ్జా చెర నుంచి విముక్తి పొందాయి. ఇక మా సంతోషానికి అవధుల్లేవు. 20 ఏళ్లసమస్యకు పరిష్కారమయ్యిందని సంబరాలు చేసుకున్నాం. బాచుపల్లి నుంచి చక్రపురి కాలనీ మీదుగా అమీన్‌పూర్ వెళ్లే 200ల అడుగుల రహదారి కూడా క్లియర్ అయ్యింది. వేల మంది రాకపోకలు సాగించే ఈ రహదారిని వెంటనే మున్సిపల్ అధికారులు చేపట్టాలి`` అని చక్రపురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఈమేరకు హైడ్రా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.