|
|
by Suryaa Desk | Tue, Feb 17, 2026, 12:45 PM
కొండాపూర్ వెంకటరమణ కాలనీలోని ఓ అపార్ట్మెంట్ పై గచ్చిబౌలి పోలీసులు, ఈగల్ టీం సంయుక్తంగా దాడులు నిర్వహించి, అంతర్రాష్ట్ర డ్రగ్స్ వ్యాపారితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 32 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు వేగేశ్న మురళి కృష్ణం రాజు (24) ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇంజనీరింగ్ చదువు మానేసి, డ్రగ్స్ వ్యాపారంలోకి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. అతను ఉత్తరాఖండ్, గోవా, పూణేలలో పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ, ఖర్చులు సరిపోక, డ్రగ్స్ కు బానిసై రెగ్యులర్ పెడ్లర్ గా మారాడు. గతంలో మణికొండలో కొకైన్ కొనుగోలు చేసి, లాభంతో విక్రయించేవాడు. గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్ళాడు.డ్రగ్స్ సరఫరా కోసం ఈ ముఠా ‘డెడ్ డ్రాప్’ (Dead Drop) అనే వినూత్న పద్ధతిని అనుసరిస్తోంది. ఈ పద్ధతిలో విక్రేత, కొనుగోలుదారు నేరుగా కలుసుకోరు. ఒక నిర్దేశిత రహస్య ప్రదేశంలో డ్రగ్స్ ఉంచి, ఆ ప్రాంతానికి సంబంధించిన లొకేషన్‌ను ఫోన్ ద్వారా షేర్ చేస్తారు. దీనివల్ల పోలీసుల కంటపడకుండా తప్పించుకోవచ్చని భావించినప్పటికీ, సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు వీరి గుట్టురట్టు చేశారు. నిందితుల ఫోన్ కాల్ డేటా, బ్యాంక్ లావాదేవీల ఆధారంగా ఈ నెట్‌వర్క్ వెనుక ఉన్న మరికొందరి కోసం గాలింపు చేపట్టారు.