|
|
by Suryaa Desk | Thu, Feb 19, 2026, 03:46 PM
పత్తి రైతులకు అలర్ట్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పత్తి కొనుగోళ్లు బంద్ కానున్నాయి. సీసీఐ ఆధ్వర్యంలో ప్రస్తుతం పత్తి కొనుగోళ్లు చేస్తుండగా.. రేపటి అవి పూర్తికానున్నాయి. ఉమ్మడి జిల్లాల్లో సుమారు నాలుగు నెలల కాలంలోనే రూ.583.23కోట్ల పత్తిని సీసీఐ సేకరించింది. దాదాపు 82 శాతం సొమ్మును రైతుల ఖాతాల్లోకి జమ చేసింది. ఖమ్మం, భద్రాచలం, కొత్తగూడెం, మద్దులపల్లి, మధిర, వైరా, బూర్గంపాడు, ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో 14 సీసీఐ కొనుగోలు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. గతేడాది అక్టోబర్‌లో కొనుగోళ్లు మొదలు కాగా.. ఈనెల 17 వరకు 7,45,391 క్వింటాళ్ల పత్తి సేకరించారు. వాటి విలువ రూ.583.23 కోట్లు. ముందు వారానికోసారి రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు చేయగా.. ప్రస్తుతం మూడు రోజుల్లోనే డబ్బులు పడుతున్నట్లు మార్కెటింగ్‌శాఖ అధికారులు వెల్లడిస్తిన్నారు. దాదాపు 6,01,391 క్వింటాళ్లకు రూ.481.11 కోట్ల చెల్లింపులు జరిగాయని చెప్పారు.
ఉమ్మడి జిల్లాలో 4.77 లక్షల ఎకరాల్లో పత్తి సాగుచేయగా గతేడాదితో పోలిస్తే దిగుబడి కాస్త తగ్గింది. దానికి తోడు మొంథా తుపాను ధాటికి పత్తి తడవటంతోపాటుగా తెగుళ్ల కారణంగా చాలా ఎకరాల్లో మొక్కలు చనిపోయాయి. దీంతో చాలా రైతులు పత్తిపంటను తొలగించి మొక్కజొన్న సాగుచేశారు. ప్రారంభంలో సీసీఐ కేంద్రాల ఏర్పాటులో జాప్యం కారణంగా రైతులు దళారులను ఆశ్రయించాల్సి వచ్చింది. వ్యాపారులు తక్కువ ధరకే పత్తి కొనుగోలు చేయటంతో రైతులకు గిట్టుబాటు కాలేదు.
ఆ తర్వాత సీసీఐ ద్వారా క్వింటాకు రూ.8,110 చొప్పున మద్దతు ధర లభించింది. ఇక ఈ ఏడాది ప్రభుత్వం కొత్తగా కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేసింది. చాలా మంది రైతులకు స్మార్ట్‌ఫోన్లు లేక, యాప్‌పై అవగాహన లేక ఇబ్బందులు పడ్డారు. ఆ తర్వాత అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించటంతో పరిస్థితుల్లో కాస్త మార్పు వచ్చింది. కాగా, శుక్రవారంతో సీసీఐ కొనుగోళ్లు ముగియనున్న నేపథ్యంలో మిగిలిన రైతులు స్లాట్ బుక్ చేసుకొని నిబంధనల ప్రకారం పత్తి విక్రయించి మద్దతు ధర పొందాలని అధికారులు సూచిస్తున్నారు.