|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 03:28 PM
ఇరాన్‌తో అణు ఒప్పందంపై చర్చలు కొలిక్కి రాకపోవడంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దశాబ్దాల తర్వాత అమెరికా ఈ ప్రాంతంలో అతిపెద్ద సైనిక మోహరింపును చేపట్టింది. రెండు విమానవాహక నౌకలతో పాటు, తొలిసారిగా అత్యంత ఆధునిక F-22 రాప్టర్ స్టెల్త్ ఫైటర్ జెట్లను ఇజ్రాయెల్‌కు తరలించింది. దీంతో ఇరాన్‌పై సైనిక చర్యకు అమెరికా సిద్ధమవుతోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద విమానవాహక నౌక అయిన యూఎస్‌ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ తూర్పు మధ్యధరా సముద్రంలో ఇజ్రాయెల్ సమీపంలోకి చేరుకోగా, మరో భారీ యుద్ధ నౌక యూఎస్‌ఎస్ అబ్రహం లింకన్ అరేబియా సముద్రంలో మోహరించింది. దీనికి తోడు, సుమారు 11 F-22 ఫైటర్ జెట్లు దక్షిణ ఇజ్రాయెల్‌లోని ఓవ్డా వైమానిక స్థావరానికి చేరుకున్నాయి. ఇరాన్‌తో యుద్ధం వస్తే పోరాటానికి వీలుగా ఈ జెట్లను ఇజ్రాయెల్‌కు పంపడం ఇదే మొదటిసారి. ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయాలని, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలను అరికట్టాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. జెనీవాలో జరిగిన చర్చలు విఫలమవడంతోనే ఈ సైనిక ఒత్తిడిని పెంచినట్లు తెలుస్తోంది. చర్చలు సఫలం కాకపోతే సైనిక చర్యకు కూడా వెనుకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు.