|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 03:29 PM
కృష్ణా జలాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య మరోసారి వివాదం రాజుకుంది. కృష్ణా బేసిన్ అవసరాలు తీర్చకుండానే ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా నీటిని ఇతర బేసిన్‌లకు తరలిస్తోందని తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చర్యలను తక్షణం అడ్డుకోవాలని కోరుతూ కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఛైర్మన్‌కు తెలంగాణ ఈఎన్‌సీ (జనరల్) రమేశ్ బాబు లేఖ రాశారు. పెన్నా బేసిన్‌కు కృష్ణా జలాలను మళ్లించేందుకు ఏపీ ప్రభుత్వం రూ.47,776.50 కోట్లతో పనులకు పరిపాలనా అనుమతులు ఇవ్వడం చట్టవిరుద్ధమని తెలంగాణ తన లేఖలో పేర్కొంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ సామర్థ్యం పెంపు, రాయలసీమ ఎత్తిపోతల పథకాలతో పాటు హంద్రీనీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ వంటి ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంచి అదనంగా 114.75 టీఎంసీల నీటిని తరలించేందుకు ఏపీ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం, బేసిన్‌లో కొత్త ప్రాజెక్టు చేపట్టాలంటే కేఆర్ఎంబీ, కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) అనుమతితో పాటు అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి అని తెలంగాణ గుర్తుచేసింది. బచావత్ ట్రైబ్యునల్ అవార్డు ప్రకారం కూడా బేసిన్ అవసరాలు తీరాకే నీటిని మళ్లించాలని స్పష్టం చేసింది. ఈ నిబంధనలను ఏపీ ఉల్లంఘిస్తోందని ఫిర్యాదులో వివరించింది.