|
|
by Suryaa Desk | Thu, Feb 26, 2026, 07:32 PM
కబ్జాల భరతం పడుతున్న హైడ్రా.. నెక్నాంపూర్‌లో ప్రభుత్వ భూమిని కాజేయాలని చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంది. ప్రజావసరాలకు ఉద్దేశించిన 2700ల గజాల స్థలాన్ని బుధవారం కాపాడింది. దీని విలు రూ. 54 కోట్ల వరకూ ఉంటుంది. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నెక్నాంపూర్ విలేజ్‌లోని 31వ సర్వే నంబరులో 59.14 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిని సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం 2002లో కేటాయించింది. ఈ మేరకు 2007లో ప్రభుత్వ అనుమతితో హుడా లే ఔట్ వేశారు. ప్లాట్ల కేటాయింపు తర్వాత ఇళ్ల నిర్మాణం జరిగింది. లే ఔట్ ప్రకారం 2700ల గజాలు పార్కుతో పాటు.. ప్రజావసరాలకు అప్పట్లో కేటాయించారు. గుట్టలా ఉండే ఈ స్థలం పార్కు అభివృద్ధికి కాస్త అవరోధంగా ఉంది. కబ్జాదారులకు ఇదే వరమైంది. డా. వై.ఎస్.ఆర్ ఎన్‌క్లేవ్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కాలనీ రెసెడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు కొంతమంది చేతి వాటానికి దారినిచ్చింది. సచివాలయ ఉద్యోగుల కాలనీ నివాసితుల సౌకర్యార్థం వినియోగించాల్సిన భూమి ప్లాట్లుగా మారింది.
సచివాలయ ఉద్యోగుల కాలనీకి ఆనుకుని సర్వే నంబరు 22లో వెంకటేశ్వర కాలనీ ఉంది. ఈ కాలనీలోని ప్లాట్‌ను చూపిస్తూ నిర్మాణ అనుమతి తెచ్చుకున్నారు. పోని అక్కడ ప్లాట్ ఉందా అంటే అదీ లేదు. అక్కడ ప్లాట్‌లో ఇప్పటికే నిర్మాణం జరిగిపోయింది. కాని అదే ప్లాట్‌ను చూపించి అనుమతి తీసుకున్న వ్యక్తి సచివాలయ ఉద్యోగుల కాలనీలోని పార్కుతో పాటు ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలంలో నిర్మాణాలు చేపట్టాడు. పునాదులతో పాటు.. పిల్లర్లు కూడా వేసి.. ఇక స్లాబ్ వేయడానికి సిద్ధమయ్యాడు. కాలనీ సంక్షేమ సంఘం నేటి ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై మున్సిపాలిటీ, రెవెన్యూ అధికారులతో కలిసి హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. ఈ విచారణలో పైన పేర్కొన్న అంశాలన్నీ వెలుగు చూశాయి. హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారి ఆదేశాల మేరకు ఆక్రమణలను హైడ్రా బుధవారం తొలగించింది. దీనితో పాటు.. గుట్టను ప్లాట్లుగా చేసి కొంతమంది అప్పటి ప్రతినిధులు అమ్మేసిన మరో 5 ప్లాట్లలో కూడా వేసిన తాత్కాలిక షెడ్డులను తొలగించి మొత్తం 2700ల గజాల మేర ప్రజావసరాలకు ఉద్దేశించిన ప్రభుత్వ స్థలం చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది. పబ్లిక్ స్పేస్‌గా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది.