|
|
by Suryaa Desk | Tue, Mar 03, 2026, 06:27 PM
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ, నటి రష్మిక వివాహంఇటీవల ఉదయ్‌పూర్‌లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నాగర్‌కర్నూల్ జిల్లాలోని విజయ్ సొంతూరు తుమ్మనపేటలో సత్యనారాయణస్వామి వ్రతం నిర్వహించారు. ఊళ్లో ఫామ్ హౌస్ కట్టుకున్న విజయ్.. పెళ్లి తర్వాత అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. ఈ సందర్భంగా ఊరి వాళ్లందరికీ భోజనాలు పెట్టారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోలను బట్టి చూస్తే.. గ్రామస్థులకు దేవరకొండ ఫ్యామిలీ నాన్ వెజ్‌తో భోజనాలు పెట్టినట్లు తెలుస్తోంది.
దీంతో సత్యనారాయణ స్వామి వ్రతం రోజున తెలంగాణలో నాన్ వెజ్ భోజనాలు పెడతారా? అని ఆంధ్రా ప్రాంత నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వ్రతం రోజున ఎంతో శుచిగా ఉండటంతోపాటు.. శాకహార భోజనం మాత్రమే అతిథులకు పెడతారు కదా, అలాంటిది మాంసాహారం పెట్టొచ్చా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అయితే దీనికి తెలంగాణ వాసులు క్లారిటీ ఇస్తున్నారు. వ్రతం అనేది కుటుంబ సభ్యులు మాత్రమే చేసుకుంటారు. గ్రామస్థులందరికీ ఆ వ్రతంతో సంబంధం ఉండదు. కాబట్టి ఇంట్లోకి నాన్ వెజ్ రానీయకుండా, దేవరకొండ కుటుంబ సభ్యులు మాత్రం శాకాహరం తీసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు. స్వామి వారికి చేసే ప్రసాదాలు ఎలాగో సంప్రదాయం ప్రకారమే శాకాహారంతో చేసినవై ఉంటాయని అంటున్నారు. అంతే కాకుండా సత్యనారాయణ స్వామి వ్రతం పూర్తయ్యాక, పీఠాన్ని కదిలించిన తర్వాత.. నాన్ వెజ్‌తో భోజనాలు పెట్టడ తప్పేమీ కాదని, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఇది చాలా కామన్ అని అంటున్నారు. ఉదయం వ్రతం జరిగితే.. ఆ తర్వాత మధ్యాహ్నం దాటాక లేదా మరుసటి రోజు నాన్ వెజ్ భోజనాలు వడ్డించడం తప్పేమీ కాదంటున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతానికి, నాన్‌వెజ్ భోజనాలకు సంబంధం ఉండదని.. అయితే కొందరు నాన్ వెజ్ పెడతారని, మరికొందరు పెట్టరని.. ఇది కుటుంబాలను బట్టి ఉంటుందని కొందరు చెబుతున్నారు.
అంతే కాదు ఆంధ్రప్రదేశ్‌లో మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర పాలక సమాజం, అగ్రవర్ణాల ఉపనయన సంస్కారం పూజ చేసిన రోజు, మాంసాహారం పెడతారని కూడా ఓ నెటిజన్ ఎక్స్‌లో పోస్టు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా సదరు నెటిజన్ పోస్టు చేశారు. ఆహారం విషయంలో ప్రాంతానికి ఒక ఆచారం ఉంటుందని, దీన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.
స్వగ్రామం తుమ్మన్‌పేటలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన
ఇదిలా ఉండగా.. మార్చి 4న హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో విజయ్ , రష్మిక పెళ్లి రిసెప్షన్ జరగనుంది. ఈ వేడుకకు సినీ, రాజకీయరంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దంపతులను రష్మిక స్వయంగా వెళ్లి ఆహ్వానించిన సంగతి తెలిసిందే.