|
|
by Suryaa Desk | Tue, Mar 03, 2026, 07:54 PM
దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఆపరేషన్ కగార్ చేపట్టి.. అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే చాలా మందిని మట్టుబెట్టగా.. ఎంతో మంది మావోయిస్టులు అడవులు వదిలేసి.. జనాల్లోకి వచ్చి పోలీసుల ముందు లొంగిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కూడా చాలా మంది నక్సల్స్ లొంగిపోయి.. జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. ఇటీవలె మావోయిస్ట్ అగ్రనేతలైన దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డి, సుజాతక్క, దామోదర్, చంద్రన్నలు.. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోయారు.
ఈ క్రమంలోనే మాట్లాడిన దేవ్‌జీ రాజకీయాల్లోకి వస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా లొంగిపోయిన మావోయిస్టుల విషయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన టీపీసీసీ చీఫ్.. కాంగ్రెస్ పార్టీలోకి లొంగిపోయిన మావోయిస్ట్‌లు వస్తే ఆహ్వానం పలుకుతామని చెప్పారు. అయితే ఇప్పటివరకు తాము మాత్రం ఏ లొంగిపోయిన మావోయిస్ట్‌లను తమ పార్టీలో చేరాలని అడగలేదని తేల్చి చెప్పారు.
మావోయిస్టులు తాము నమ్ముకున్న సిద్ధాంతం కోసం గత కొన్ని దశాబ్దాలుగా పోరాటం చేశారని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. తాము మొదటి నుంచి ఆపరేషన్ కగార్‌ను వ్యతిరేకించామని.. పాకిస్తాన్‌తో చర్చలకు ఒప్పుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. దేశంలో మాత్రం మావోయిస్టులతో చర్చలకు అంగీకరించలేదని విమర్శించారు. మావోయిస్టుల సిద్ధాంతంతో తమకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్న టీపీసీసీ చీఫ్.. ప్రజల కోసం పోరాడిన వాళ్లపై గౌరవం ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అయినా.. మావోయిస్టులు అయినా పేద ప్రజల కోసమే పోరాటం చేసినట్లు గుర్తు చేశారు.
ఇక అంతకుముందు బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించిన మహేష్ కుమార్ గౌడ్.. తెలంగాణ కోసం పని చేసిన వాళ్లను బీఆర్ఎస్ పార్టీ ఎన్నడూ గౌరవించలేదని మండిపడ్డారు. మార్చి నెలలో కొన్ని కార్పొరేషన్ పదవులు ఇస్తామని చెప్పిన టీపీసీసీ చీఫ్.. కార్పొరేషన్ పదవులపై కసరత్తు జరుగుతోందని వివరించారు. ఇక ఖమ్మం భూదాన్ భూముల వ్యవహారంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేసిన వ్యాఖ్యలు.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమాధానం చెప్పారని తెలిపారు. రాజకీయాల కోసమే పినరయి విజయన్ మాట్లాడుతున్నారి.. కేరళలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.