|
|
by Suryaa Desk | Tue, Mar 03, 2026, 07:56 PM
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. మార్చురీలో చనిపోయిన శవాన్ని వీధి కుక్క పీక్కు తింటున్న ఘటన కలకలం రేపింది. జడ్చర్ల మండలంలోని నాగసాలకు చెందిన భీమేశ్వర్ అనే లారీ డ్రైవర్ శనివారం ఇంటి నుంచి బహిర్భూమికి బయటకు వెళ్లాడు. కుటుంబసభ్యులు డ్యూటీకి వెళ్లాడని భావించారు.. అయితే భీమేశ్వర్ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు కంగారుపడ్డారు. అతడి కోసం వెతికినా ఆచూకీ దొరకలేదు.. అయితే చివరికి సోమవారం స్థానికంగా ఉన్న చెరువులో మృతదేహం కనిపించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో డెడ్‌బాడీని నేలపైనే ఉంచారు. అయితే ఓ వీది కుక్క లోపలకి చొరబడింది.. భీమేశ్వర్ శవాన్ని పీక్కుతింటూ కనిపించింది. కుక్క పీక్కుతింటున్న సమయంలో ఎవరో వీడియో తీయడంతో వైరల్ అయ్యింది. అయితే పోస్ట్‌మార్టమ్ కోసం సిబ్బంది లోపలికి వెళుతున్న సమయంలో కుక్క కూడా వెళ్లిందని ఆస్పత్రి సూపరింటెండెంట్ అంటున్నారు. వెంటనే గమనించి సిబ్బంది కుక్కను తరిమేసినట్లు చెప్పుకొచ్చారు. మార్చురీ దగ్గర సెక్యూరిటీ గార్డు విధుల్లో ఉంటారని.. మార్చురీ గది తాళం చెడిపోయిందని.. దాన్ని బాగు చేయించేందుకు బయటకు వెళ్లాడన్నారు. అదే సమయంలో వీధి కుక్క లోపలికి వెళ్లిందని చెప్పుకొచ్చారు. అయితే ఈ ఘటనపై భీమేశ్వర్ కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా స్పందించారు. మార్చురీలో మృతదేహాన్ని వీధి కుక్క పీక్కుతిన్న ఘటన బాధాకరమన్నారు. ఈ ఘటనను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. వాస్తవానికి జడ్చర్లలో 30 పడకల ఆసుపత్రిని 2023లో 100 పడకలకు పెంచిన సంగతి తెలిసిందే. కొత్త ఆసుపత్రిలో మార్చురీకి సంబంధించి సరైన వసతులు లేవు. ఈ క్రమంలో దీంతో పాత ఆసుపత్రిలో ఉన్న మార్చురీలోనే పోస్టుమార్టం నిర్వహిస్తున్నారని చెబుతున్నారు.